Vaccine Orders: ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ విక్రయం.. రూల్స్ మార్చిన కేంద్రం..

ప్రైవేటు ఆస్పత్రుల నుంచి కేవలం రూ. 150 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు.

టీకా విధానంలో మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తయారీ సంస్థల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు ఇష్ట?

  • Share this:
కరోనా కట్టడికి ఏకైక ఆయుధంగా భావిస్తున్న వ్యాక్సినేషన్​ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఓవైపు ప్రభుత్వ వ్యాక్సిన్​ కేంద్రాల్లో కొరత ఏర్పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్​ ఆసుపత్రుల్లో లక్షల కొద్దీ టీకాలు నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. దీంతో టీకా విధానంలో మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. తయారీ సంస్థల నుంచి ప్రైవేటు ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి వీల్లేదని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిన్ ప్లాట్‌ఫాంపై మాత్రమే వ్యాక్సిన్​ ఆర్డర్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతేకాదు, వ్యాక్సిన్ల వృథాను అరికట్టేందుకు నెలవారీ కొనుగోళ్లపై పరిమితి విధించింది. ఈ నూతన మార్గదర్శకాలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. వ్యాక్సిన్ల ఆర్డర్లకు చేసే చెల్లింపులను కూడా నేషనల్ హెల్త్ అథారిటీ పోర్టల్ (ఎన్‌హెచ్‌ఏ) ద్వారా ఎలక్ట్రానిక్‌ విధానంలోనే చేయాలని తెలిపింది. ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ల సరఫరా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోనే జరుగుతుందని స్పష్టం చేసింది.

నెలవారీ పరిమితి కోసం ఫార్ములా
ప్రైవేట్ టీకా కేంద్రం ద్వారా ఇచ్చే వ్యాక్సిన్లకు నెలవారీ పరిమితి ఉంటుంది. గత నెలలో రోజువారీ సగటు వినియోగాన్ని బట్టి ఎన్ని డోసులకు ఆర్డర్​ ఇవ్వాలనే దాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది. ఉదాహరణకు, జూలై నెలలో ఆర్డర్‌ ఇచ్చే ప్రైవేటు ఆసుపత్రుల నెలవారీ పరిమితి నిర్ణయించేందుకు.. జూన్ 10 నుంచి జూన్ 16 వరకు వినియోగించిన డోస్​లను పరిగణలోకి తీసుకుంటారు. ఆ కాలంలో, 630 డోస్​లను ఇచ్చినట్లైంతే.. రోజువారీ సగటు వ్యాక్సిన్ల సంఖ్య 90 అవుతుంది. అందువల్ల, జూలై నెలలో గరిష్టంగా 90 x 30 x 2 = 5,400 వ్యాక్సిన్​ డోసులను మాత్రమే ఆర్డర్​ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ, వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ప్రైవేటు ఆసుపత్రులు తొలిసారిగా చేరితే.. అప్పుడు హాస్పిటల్​లోని బెడ్ల సంఖ్య ఆధారంగా టీకాల కేటాయింపును నిర్ణయిస్తారు.

నూతన టీకా విధానం
జూన్​ 21 నుంచి దేశవ్యాప్తంగా నూతన వ్యాక్సినేషన్​ విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం.. వ్యాక్సిన్​ తయారీ సంస్థల నుంచి 75% డోసులను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. మిగతా 25 % డోసులను వ్యాక్సిన్​ తయారీదారులు నేరుగా ప్రైవేట్​ ఆసుపత్రులకు విక్రయించుకోవచ్చని కేంద్రం తెలిపింది. అయితే, అధిక ధరల కారణంగా ప్రైవేట్​లో టీకాలకు స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కేటాయించిన దాని కంటే చాలా తక్కువ మొత్తంలోనే డోసులు వినియోగిస్తున్నారు. తద్వారా వ్యాక్సిన్లు నిరుపయోగంగా పడి ఉన్నాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు 25 శాతం టీకాలను కేటాయించడం చాలా ఎక్కువని, దీని వల్ల వ్యాక్సిన్లు వృదా అవుతున్నాయని కొన్ని రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాశాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది.
Published by:Kishore Akkaladevi
First published: