CENTRE SERVES FINAL NOTICE TO TWITTER ON NEW IT RULES COMPLY OR FACE CONSEQUENCES SK
Twitter Vs Centre: ట్విటర్‌కు కేంద్రం ఫైనల్ వార్నింగ్.. అలా చేయలేదో తీవ్ర పరిణామాలు
ట్విట్టర్ లోగో
భారత్‌లో ట్విటర్ అధికారులను నియమించకపోవడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ శనివారం నోటీసులు జారీచేసింది. వెంటనే భారత్‌లో అధికారులను నియమించాలని స్పష్టం చేసింది.
కొత్త ఐటీ నిబంధనల విషయంలో కేంద్రం, ట్విటర్ మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. ఐటీ రూల్స్‌కు సంబంధించి ఇప్పటి వరకు ట్విటర్ స్పందించకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత్‌లో అధికారులను నియమించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి హెచ్చరికగా పేర్కొంటూ శనివారం మరోసారి నోటీసులు జారీచేసింది. వెంటనే భారత్‌లో అధికారులను నియమించాలని స్పష్టం చేసింది. లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇవాళ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో పాటు పలువరు ఆర్ఎస్ఎస్ నేతల అధికారిక ట్విటర్ ఖాతాలకు బ్లూ టిక్ తొలగించిన క్రమంలోనే కేంద్రం నోటీసులు పంపండం హాట్ టాపిక్‌గా మారింది.
Government of India gives final notice to Twitter for compliance with new IT rules. pic.twitter.com/98S0Pq8g2U
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో The Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021ని నోటిఫై చేసింది. వార్తా వెబ్సైట్లు, ఓటీటీలు, సోషల్ మీడియాకు సంబంధించిన ఆ కొత్త రూల్స్ మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం ఆయా సంస్థలు భారత్‌లో అధికారులను నియమించుకోవడం, నెటిజన్ల ఫిర్యాదులను పరిష్కరించడం, ఎవరైనా అభ్యంతరక కంటెంట్ పోస్ట్ చేస్తే తొలగించడం వంటివి చేయాలి. అంతేకాదు ఏదైనా పోస్ట్ లేదా మెసేజ్ గురించి ప్రభుత్వం అడిగితే, ఆ మెసేజ్‌ను మొదట ఎవరు సృష్టించారు? అనే వివరాలను వెల్లడించాలి.
ఐతే గడువు ముగిసినా ట్విటర్ సహా పలు సామాజిక మాధ్యమాలు మాత్రం కొత్త నిబంధనలను పాటించడం లేదు. నిబంధనల ప్రకారం భారత్‌లో చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను నియమించాల్సి ఉంది. ట్విటర్ ఇంకా దానిపై నిర్ణయం తీసుకోలేదు. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీస్, నోడల్ కాంటాక్ట్ అధికారులను భారత్‌కు చెందిన వ్యక్తులను కూడా నియమించలేదు. ఈ క్రమంలోనే ట్విటర్ తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరి సారిగా నోటీసులు పంపింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కాగా, భారత ఐటీ నిబంధలను విదేశీ సామాజిక మాధ్యమాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఇటీవల వాట్సప్ సైతం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్ ఖాతాకు వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్‌ను శనివారం ట్విటర్ తొలగించింది. ఈ క్రమంలో ట్విటర్ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. ఉపరాష్ట్రపతి ట్విటర్ ఖాతాకే బ్లూ టిక్ తొలగిస్తావా? ఎంత ధైర్యం? అంటూ విరుచుకుపడ్డారు. ట్విటర్‌ను ఇండియాలో బ్యాన్ చేయాలని ట్వీట్ల మోత మోగించారు. దాంతో తప్పు తెలుసుకున్న ట్విటర్.. వెంకయ్యనాయుడి ఖాతాకు మళ్లీ బ్లూ టిక్ పునురుద్ధరించింది. కొంతకాలంగా ఆ ఖాతా యాక్టివ్‌గా లేకపోవడం వల్లే తొలగించామని తెలిపింది. పలువురు ఆర్ఎస్ఎస్ నేతల ఖాతాలకు కూడా బ్లూటిక్ తొలగించింది ట్విటర్. అది జరిగిన కొన్ని గంటల్లోనే ట్విటర్‌కు కేంద్రం ఫైనల్ వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశమయింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.