కొద్ది నెలల క్రితం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం కొంత మేర వెనక్కి తగ్గేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను ఏడాదిన్నర పాటు నిలిపేసేందుకు సిద్ధమని కేంద్రం తమకు తెలిపిందని రైతు సంఘాల నేతలు తెలిపారు. అయితే చట్టాల నిలిపివేతకు తాము ఒప్పుకోమని.. వీటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని రైతు సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. కేంద్రం మంత్రులతో సమావేశం అనంతరం రైతు సంఘాల నేతలు ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నేడు జరిగిన పదో విడత చర్చల్లోనూ ప్రతిష్టాంభన కొనసాగడంతో.. జనవరి 22(ఎల్లుండి) మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది.
వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం నేడు మరో విడత చర్చలు జరిపింది. ఇంతకు ముందు ఈ నెల 15న జరిగిన చర్చలు పురోగతి లేకుండానే ముగిశాయి. మరోవైపు కొత్త వ్యవసాయ చట్టాలు వ్యవసాయ ప్రజాప్రయోజనాల కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. మంచి చర్యలు తీసుకున్నప్పుడల్లా అడ్డంకులు వస్తాయని, రైతుల నాయకులు తమదైన రీతిలో పరిష్కారం కోరుకుంటున్నందున సమస్యను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని కేంద్రం పేర్కొంది.
Govt said that it is ready to file an affidavit in the court to the effect that it would put the implementation of the laws on hold for one & half a year: Hannan Mollah, General Secretary, All India Kisan Sabha pic.twitter.com/1vZlxl1rf9
— ANI (@ANI) January 20, 2021
ఇదిలా ఉండగా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్ తన మొదటి సమావేశాన్ని మంగళవారం నిర్వహించింది. వ్యవసాయ చట్టాలకు సభ్యులు అనుకూలంగా ఉన్నారని, సుప్రీం కోర్టు నియమించిన ప్యానెల్‌ను రైతులు తిరస్కరించారు. చట్టాలను రద్దు చేయడం, పంటలకు కనీస మద్దతు ధర తప్ప మరో ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు స్పష్టం చేశారు. అయితే చట్టాల రద్దు మినహా దేనికైనా అంగీకారమేనని స్పష్టం చేసిన ప్రభుత్వం.. తాజాగా ఏడాదిన్నర పాటు ఈ చట్టాలను నిలిపి వేసేందుకు అంగీకరించిందని రైతు సంఘాల నేతలు తెలిపారు. దీంతో ఈ నెల 22న జరగబోయే 11వ విడత చర్చల్లో అయినా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest