కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధమయింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చోటుచేసుకోబోతున్నాయి. నేడు సాయంత్రం 6 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తం 21 మంది కొత్త వారికి మంత్రి పదవులు ఖరారయినట్లు సమచారం. ఈసారి యువ నేతలకే ప్రధాని మోదీ పెద్ద పీటవేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు. దేశంలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం కేంద్రం లక్ష్యమని..‘సహకార్ సే సమృద్ధి’ (సహకారంతో సమృద్ధి) విజన్‌ను సాధించేందుకు సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సెక్రటేరియెట్ అధికారులు తెలిపారు. దేశంలో సహకార ఉద్యమానికి బలం చేకూర్చేందుకు న్యాయ, విధాన, పాలనాపరమైన విధానాలను సహకార మంత్రిత్వశాఖ రూపొందించనుంది.
సహకార సంస్థల సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్) కోసం ఈ మంత్రిత్వ శాఖ పని చేస్తుంది. అంతేకాదు బహుళ స్థాయి సహకార సంస్థల అభివృద్ధిని సాకారం చేసేందుకు సహకారమంత్రిత్వశాఖ పాటు పడుతుందని అధికారులు వివరించారు. సమాజ ఆధారిత అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తుందని.. కొత్త మంత్రిత్వ శాఖ ఆ దిశగా ముందడుగుగా సంబంధిత అధికారులు అభివర్ణించారు. సహకారమంత్రిత్వశాఖ ఏర్పాటుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి చేసిన ప్రకటన వాస్తవరూపు దాల్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఈ కొత్త శాఖకు నేడు కొత్త మంత్రిని నియమించే అవకాశముంది.
మోదీ కేబినెట్లో యువతకు గతంలో ఎన్నడు లేని విధంగా ఈసారి ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. యువకులు, బీసీలు, మహిళలకు ప్రత్యేకించి విద్యావంతులకు క్యాబినెట్ విస్తరణలో ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. దీనిలో ఇతర వెనుకబడిన తరగతులకు (ఓబిసి) చెందిన 24 మంత్రులను చేర్చుకుంటారని వారు తెలిపారు. మొత్తం 81 మంది కేంద్ర మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 53 మంది మంత్రులే ఉన్నారు. తాజా మంత్రివర్గ విస్తరణలో కేబినెట్ హోదాలో ఆరుగురు, మంత్రులుగా 20 మందికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రుల్లో ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న వారిపై పనిభారం తగ్గించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అసలు పనితీరు సరిగ్గా లేని వారికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
కేంద్ర మంత్రి వర్గం నుంచి స్మృతి ఇరానీ, సదానంద గౌడను తప్పించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. స్మృతి ఇరానీకి యూపీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ప్రియాంక గాంధీ, మాయవతిని ధీటుగా ఎదుర్కొనేందుకు స్మృతి ఇరానీ సేవలను బీజేపీ వినియోగించుకునే అవకాశముంది. ఇక సదానంద గౌడను కూడా కేబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతారని తెలుస్తోంది. మరికొందరి శాఖలు కూడా మారవచ్చని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cabinet Reshuffle, Central cabinet, Narendra modi, Union cabinet