రెండో రాజధానిగా హైదరాబాద్... మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం

గతంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు రాగా... అలాంటి ఆలోచన ఏమీ తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది.

news18-telugu
Updated: November 27, 2019, 5:11 PM IST
రెండో రాజధానిగా హైదరాబాద్... మరోసారి క్లారిటీ ఇచ్చిన కేంద్రం
చార్మినార్ (ఫైల్ ఫోటో)
  • Share this:
దేశానికి హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేసే అవకాశం ఉందని వచ్చిన ఊహాగానాలకు కేంద్రం మరోసారి తెరదించింది. ఈ ప్రచారంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్‌ నగరాన్ని దేశ రెండో రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనేదీ తమ మంత్రిత్వశాఖలో లేదని ఆయన కొద్దిరోజుల క్రితమే స్పష్టం చేశారు. తాజాగా రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ఓ సభ్యుడు ఈ సందేహాన్ని తిరిగి వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశంలో దేశానికి రెండో రాజధాని అవసరమని ప్రభుత్వం భావిస్తుందా అని పరోక్షంగా హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిని చేసే ఆలోచన ఉందా అని ప్రశ్నించారు. అయితే హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశానికి రెండో రాజధాని ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రశ్నకు కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

గతంలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే ఊహాగానాలు రాగా... అలాంటి ఆలోచన ఏమీ తమకు లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఆ తరువాత మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆయన వ్యాఖ్యలతో కేంద్రం మదిలో ఇలాంటి ఆలోచన ఉందేమో అనే ప్రచారం జరిగింది. అయితే కేంద్రం దగ్గర ఇలాంటి ఆలోచన ఏమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తాజాగా రాజ్యసభలో ఇదే విషయాన్ని నిత్యానంద రాయ్ లిఖిత పూర్వకంగా తేల్చి చెప్పారు.


First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>