కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజులు క్రితం వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (VPN), క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లపై నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇండియన్ ఐటీ రూల్స్‌కు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని అన్ని వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్ర ఐటీ శాఖ గతంలో స్పష్టం చేసింది. ఈ రూల్స్ నచ్చని కొన్ని వీపీఎన్ ప్రొవైడర్లు దేశంలో సర్వీసులను నిలిపేశాయి.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం (Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. నార్డ్ వీపీఎన్, ఎక్స్‌ప్రెస్ వీపీఎన్, టార్ వంటి కంపెనీలు అందించే థర్డ్-పార్టీ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ (VPN)తో పాటు క్లౌడ్ సర్వీసెస్ (Cloud Services)ను ప్రభుత్వ ఉద్యోగులు (Government Employees) ఉపయోగించకూడదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల వీపీఎన్, క్లౌడ్ సర్వీసుల వినియోగంపై కేంద్రం ఎందుకు నిషేధం విధించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్‌బాక్స్ వంటి ఏదైనా ప్రభుత్వేతర క్లౌడ్ సర్వీస్‌లో ఎలాంటి ఇంటర్నల్, రెస్ట్రిక్టెడ్ లేదా కాన్ఫిడెన్షియల్ ప్రభుత్వ డేటా ఫైల్స్‌ను సేవ్ చేయవద్దని ఉద్యోగులను కోరుతూ కేంద్రం ఒక తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు థర్డ్-పార్టీ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు కూడా ఈ ఆదేశాల్లో పేర్కొంది. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నార్డ్ వీపీఎన్, ఎక్స్ప్రెస్వీపీఎన్, టార్ వంటి వీపీఎన్ సర్వీసులను వినియోగించకూడదు.
ఎక్స్ప్రెస్వీపీఎన్, సర్ఫ్‌షార్క్, నార్డ్ వీపీఎన్ వంటి వీపీఎన్ సర్వీస్ ప్రొవైడర్లు ఇకపై దేశంలో తమ సేవలను అందించబోమని చెప్పిన కొద్ది రోజుల తర్వాతే ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇండియాలో వీపీఎన్ కంపెనీలు ఎలా పనిచేయాలనే దానిపై ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) రీసెంట్గా కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఈ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఏప్రిల్ 28న వీపీఎన్ ప్రొవైడర్లు తమ కస్టమర్ల పేర్లు, చిరునామాలు, వీపీఎన్ సేవను ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారనే దానితో సహా వారి వివరాలను తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు నచ్చక పలు కంపెనీలు తమ సేవలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించాయి.
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), దేశ సైబర్ సెక్యూరిటీ మొత్తం బలాన్ని మెరుగుపరచడానికే ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు/ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సైబర్ సెక్యూరిటీ పరంగా ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే దానిపై అవగాహన కల్పించడానికి, ఈ మార్గదర్శకాలు తీసుకువచ్చినట్లు ఎన్ఐసీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
అలానే ప్రభుత్వ ఉద్యోగులు తమ మొబైల్ ఫోన్లను జైల్బ్రేక్ లేదా రూట్ చేయవద్దని.. ఇంటర్నల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేయడానికి క్యామ్ స్కానర్ వంటి ఎక్స్టర్నల్ మొబైల్ యాప్స్ ఉపయోగించవద్దని కూడా కోరింది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులందరూ ఈ రూల్స్ పాటించాలి. పాటించని పక్షంలో సంబంధిత చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు (CISOs)/డిపార్ట్మెంట్ హెడ్లు తగిన చర్యలు తీసుకోవచ్చని కేంద్రం పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central govt employees, Employees, ExpressVPN, Google Drive, Union government