Home /News /national /

CENTRE ANNOUNCED TO REPEL AGRI LAWS WHAT ARE THREE FARM LAWS WHY FARMERS OPPOSED SK

Farm Laws: సాగుచట్టాలను రద్దు చేసిన కేంద్రం.. అసలా చట్టాల్లో ఏముంది? రైతుల అభ్యంతరమేంటి?

ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

Agri Laws: సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఇప్పుడు దాని గురించే దేశమంతటా చర్చ జరుగుతోంది. అసలు సాగు చట్టాల్లో ఏముంది? ఏడాది కాలంగా రైతులు ఎందుకు ఆందోళనలు చేేస్తున్నారు?

  రైతుల ఆందోళనలకు కేంద్రం దిగొచ్చింది.  ఏడాది కాలంగా అన్నదాత చేస్తున్న పోరాటానికి తలొగ్గింది. ఎట్టకేలకు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంది. రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామని.. ఇన్నాళ్లు రైతులను ఇబ్బందిపెట్టినందుకు క్షమాపణలు చెబుతున్నట్లు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రైతులకు అపారమైన అవకాశాలు కల్పించి, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న గొప్ప సంకల్పంతోనే ఆ చట్టాలను తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.  తాము ఏం చేసినా రైతుల ప్రయోజనాల కోసమే చేశామని ప్రధాని చెప్పుకొచ్చారు.

  నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. సెప్టెంబరులో పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చ అనంతరం ఆమోద ముద్రపడింది. అనంతరం సెప్టెంబరు 28న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేయడంతో చట్టాలుగా మారాయి. వాటికి ఆమోదం తెలుపవద్దంటూ విపక్షాలకు చెందిన నేతలు రాష్ట్రపతి కోవింద్‌ను కలసి విజ్ఞప్తి చేశాయి. వాటిని మళ్లీ పార్లమెంట్ పునఃపరీశీలను పంపాలని కోరాయి. ఐనప్పటికీ ఆ మూడు బిల్లులకు ఆమోదముద్ర వేశారు రాష్ట్రపతి.   ఆ తర్వాత కొత్త చట్టాల లొల్లి సుప్రీంకోర్టుకు చేరింది.  వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో వ్యవసాయ చట్టాలకు బ్రేకులు పడ్డాయి.  అసలు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్లో అసలు ఏముంది?

  రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద చట్టం-2020
  ఏ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పంట అయినా... పంట వేయడానికి ముందే రైతు, కొనుగోలుదారు ఒప్పందం కుదుర్చుకునేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తుంది. కనిష్ఠంగా ఒక పంటకాలం నుంచి అయిదేళ్ల వరకు ఒప్పందం చేసుకోవచ్చు. ఈ ఒప్పందంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరను ఖచ్చితంగా పేర్కొనాలి. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లో తలెత్తే సమస్యల పరిష్కారానికి మూడంచెల వ్యవస్థ సయోధ్య (కన్సిలియేషన్) బోర్డ్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, అప్పీలేట్ అథారిటీ ఉంటుంది.

  రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) చట్టం-2020

  వ్యవసాయ మార్కెట్లను నియంత్రించే మార్కెట్ కమిటీల ప్రాదేశిక సరిహద్దులతో సంబంధం లేకుండా .. దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వ్యవసాయ వాణిజ్యానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. అంటే రైతు ఎక్కడైనా తమ ఉత్పత్తిని అమ్ముకోవచ్చు. మార్కెట్ కమిటీల సరిహద్దులు దాటి విక్రయించే వ్యవసాయ ఉత్పత్తులపై రాష్ట్రాలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఎలాంటి పన్నులు వేయడానికి, ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు.

  నిత్యవసర సరకుల(సవరణ) చట్టం 2020
  ప్రస్తుతం అమలులో ఉన్న నిత్యవసర సరకుల చట్టం - 1955కి కొన్ని సవరణలు చేశారు. ఈ కొత్త చట్టం ప్రకారం.. నిత్యవసర సరకుల జాబితాలో ఉన్న వస్తువుల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, వాణిజ్యాల నియంత్రణాధికారం కేంద్రానికి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యవసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం దీని ఉద్దేశమని కేంద్రం చెబుతోంది. యుద్ధం, దుర్భిక్షం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనెగింజలు, నూనెలు వంటి ఆహార వస్తువులపై నియంత్రణ ఉంటుంది.

  ఐతే ఈ చట్టాలను ముఖ్యంగా పంజాబ్, హర్యానా, యూపీలోని కొన్ని రైతు సంఘాలు తీవ్రంగా తప్పుబట్టుతున్నాయి. ఇందులో కనీస మద్దతు ధర ఊసే లేదని మండిపడుతున్నాయి. కార్పొరేట్లు నిర్ణయించిన ధరకే ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ వ్యవసాయంతో రైతు తన పొలంలోనే కూలీగా మారుతాడని విమర్శించారు. ఆ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏడాదికి పైగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రం దిగొచ్చింది. సాగు చట్టాలను రద్దు చేసింది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Farmers, Farmers Protest, New Agriculture Acts, PM Narendra Modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు