CENTRE AND FARMERS TALKS END INCONCLUSIVELY FOR NINTH TIME OVER FARM REFORM LAWS NEXT MEETING ON 19 JANUARY BA
Farmers Protest: కేంద్రం - రైతుల చర్చలు అసంపూర్తి.. 9వ సారీ
ఆందోళన చేస్తున్న రైతులు (Image: PTI)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని రైతులు మరోసారి డిమాండ్ చేసినట్టు తెలిసింది. అలాగే, మద్దతు ధరకు సంబంధించి చట్టంలో స్పష్టంగా పేర్కొనాలని వారు డిమాండ్ చేసినట్టు సమాచారం.
వ్యవసాయ సంస్కరణల చట్టాలపై కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య చర్చలు మరోసారి అసంతృప్తిగా ముగిశాయి. తొమ్మిదోసారి కూడా ఎలాంటి నిర్ణయం రాలేదు. దీంతో మరోసారి ఈనెల 19న భేటీ కావాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలని రైతులు మరోసారి డిమాండ్ చేసినట్టు తెలిసింది. అలాగే, మద్దతు ధరకు సంబంధించి చట్టంలో స్పష్టంగా పేర్కొనాలని వారు డిమాండ్ చేసినట్టు సమాచారం. అయితే, రైతులు పట్టువిడుపు ధోరణి అవలంభించాని కేంద్రం కోరింది. దీంతో చర్చలు సఫలం కాలేదు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ దిల్లీ విజ్ఞాన్ భవన్లో రైతులతో చర్చలు జరిపారు. లంచ్ వరకు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిసింది. చట్టాలను రద్దు చేయాలనే ఒకే అంశానికి కట్టుబడి ఉండకుండా రైతులు పట్టువిడుపులలు ప్రదర్శించాలని వ్యవసాయ మంత్రి తోమర్ విజ్ఞప్తి చేశారు. రైతులు తీసుకొచ్చిన ఎన్నో డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినా ప్రభుత్వం మొండిగా ఉందని, అహం ప్రదర్శిస్తోందని అనడం సరికాదన్నారు.
కేంద్రం, రైతు సంఘాల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో విద్యుత్ బిల్లు, పంట వ్యర్ధాలను కాలిస్తే శిక్షల తగ్గింపు అంశంపై మాత్రమే ఏకాభిప్రాయం కుదిరింది. రైతులతో చర్చల కోసం సుప్రీంకోర్టు ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయగా.. అందులో సభ్యుడైన భూపిందర్ సింగ్ మాన్ వైదొలగిన విషయం తెలిసిందే.
మరోవైపు ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రాహల్ గాంధీ, ప్రియాంక గాంధీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతుల సంఘాలతో కేంద్రం తొమ్మిదో దఫా చర్చలు జరుపుతున్న సమయంలోనే కాంగ్రెస్ ఈ ర్యాలీ చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. జనవరి 26వ తేదీన ట్రాక్టర్ల ర్యాలీ చేయాలని నిర్ణయించారు. రిపబ్లిక్ డే పరేడ్ జరిగే సమయంలోనే వారు కూడా ర్యాలీ చేయనున్నారు. కానీ, తాము పరేడ్‌కు ఎలాంటి ఆటంకం కలిగించబోమని రైతులు స్పష్టం చేశారు. తమ పని తాము చేసుకుంటామని, తమ ర్యాలీ తాము చేస్తామని ప్రకటించారు. ఎర్రకోట వద్ద కాకుండా, ఢిల్లీ-హర్యానా సరిహద్దులో నిర్వహించబోయే ట్రాక్టర్ల ర్యాలీకే రైతు సంఘాలు భారీగా ప్లాన్ చేశాయి. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు రైతులంతా తమ ట్రాక్టర్లతో ఢిల్లీ సరిహద్దులకు చేరుకోవాలని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ పిలుపునిచ్చింది. రైతు చట్టాలకు తామంతా వ్యతిరేకమని మళ్ళీ కేంద్రానికి చాటి చెప్పాలని కోరింది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.