వ్యవసాయ రంగం (Agriculture)పై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక దేశం..ఒకే ఎరువు నినాదంతో.. ఇకపై ఎరువులన్నింటికీ ఒకే బ్రాండ్ ఉంటుందని తెలిపింది. 'భారత్' (Bharat fertilisers) బ్రాండ్ కిందే వాటిని విక్రయిస్తారు. ఏ కంపెనీ తయారు చేసినప్పటికీ.. భారత్ పేరుతోనే మార్కెట్లో అమ్ముతారు. భారత్ యూరియా.. భారత్ డీఏపీ.. ఇకపై ఎరువుల పేర్లు ఇలా ఉండబోతున్నాయి. ప్రధాన మంత్రి జన్ ఉర్వారక్ పరియోజన (PM BJP) పథకం కింద కేంద్రం ప్రభుత్వం తక్కువ ధరకే ఎరువులను రైతులకు అందజేస్తోంది. అందువల్ల భారత్ బ్రాండ్ ఎరువుల బస్తాలపై పీఎం బీజేపీ పథకం పేరును కూడా ముద్రిస్తారు. ఎరువులను తయారు చేసిన కంపెనీ పేర్లను సైతం బ్యాగ్‌పై ముద్రించవచ్చు. కానీ చిన్న చిన్న అక్షరాలతో మాత్రమే ఉండాలి. ఇంతకాలం ఒక్కో కంపెనీ ఒక్కో పేరుతో ఎరువులను ప్రత్యేక బ్రాండ్లతో విక్రయిస్తున్నాయి. ఐతే ఇకపై అలా కుదరదని స్పష్టం చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులిచ్చింది.
సెప్టెంబరు 15 నుంచి పాతపేర్లతో ఉండే ఖాళీ సంచులను ఏ కంపెనీకూడా కొనరాదని కేంద్రం సూచించింది. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి 'భారత్ బ్రాండ్' పేరుతో ముద్రించిన ఎరువులను మార్కెట్లో విక్రయించడం ప్రారంభించాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాత బ్రాండ్ల బస్తాలన్నింటినీ డిసెంబరు 31లోగా విక్రయించాల్సి ఉంటుంది. 2023 జనవరి 1 నుంచి పాత పేర్లతో ఉన్న సంచులు మార్కెట్లో కనబడకూడదు. ఆ బ్రాండ్‌లతో వాటిని విక్రయించాడానికి వీల్లేదు.. భారత్ బ్రాండ్ ఎరువులనే అమ్మాలని స్పష్టం చేసింది. ఏ ఎరువు బస్తాపై పేరు ఎలా ఉండాలని సూచిస్తూ.. నమూనాలను కూడా కేంద్రం విడదల చేసింది. ఉదాహరణకు యూరియా బస్తాను తీసుకుంటే.. ఆ సంచిపై ఒకవైపు మూడొంతుల భాగం ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారక్ పరియోజన, భారత్ యూరియా అని ముద్రించాలి. మిగిలిన భాగంలో ఆ ఎరువు ఉత్పత్తి చేసే కంపెనీ వివరాలను పేర్కొనాల్సి ఉంటుంది.
భారత్ పై దాడిచేయడానికి 30 వేల సుపారీ.. బార్డర్ వద్ద పాక్ ఉగ్రవాది అరెస్టు..
అంతేకాదు ఎరువుల చిల్లర విక్రయ దుకాణాల్లో రైతులకు అన్ని రకాల సేవలు అందించడానికి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రం'(PMKSK) అనే పథకాన్ని అమల్లోకి తెచ్చింది. వ్యవసాయంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. 'వన్ స్టాప్ షాప్' పేరుతో ఉండే ఈ మోడల్ ఎరువుల దుకాణాల్లో రైతులకు కావాల్సినవన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ఇక్కడ నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వాటిని నిర్ణీత ధరలకే అమ్మాలి. భూసార, విత్తన, ఎరువు నాణ్యత పరీక్షలు కూడా చేయాలి. వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల పరికరాలు కూడా అందుబాటులో ఉండాలి. ఏ కాలంలో ఎలాంటి పంట వేయాలి? ఏయే ఎరువులు వాడాలన్న దానిపై రైతులకు సలహాలు, సూచనలను ఇవ్వాలి.
దేశవ్యాప్తంగా మొత్తం 3.30 లక్షల ఎరువుల దుకాణాలున్నాయి. పైలెట్ ప్రాజెక్టు కింద జిల్లా స్థాయి దుకాణాలను అక్టోబరు 2 నాటికి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రంగా మార్చుతారు. మొదటి దశలో నవంబరు నాటికి 31,460, జనవరి నాటికి 1,82,126, మూడో దశలో ఫిబ్రవరి ఆఖరుకల్లా మిగిలిన 1,16,049 దుకాణాలను మార్చాల్సి ఉంటుందని కేంద్రం వెల్లడించింది. గ్రామస్థాయిలో అయితే 150, మండల స్థాయిలో 200, జిల్లా స్థాయిలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కిసాన్ సమృద్ధి కేంద్రాలు ఉండాలి. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వమే కీలక పాత్రపోషిస్తుందని సూచించడానికే ఈ మార్పులను చేసింది కేంద్ర ప్రభుత్వం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Farmers