పెన్షన్ రూ.6000కు పెంపు?... ప్రైవేట్ ఉద్యోగులకు వరం...

నిర్మలా సీతారామన్

కేంద్ర ప్రభుత్వం ఈసారి ప్రైవేట్ ఉద్యోగులకు మేలు చేయబోతోందా? బడ్జెట్‌లో పెన్షన్ రూపంలో వరం ఇవ్వబోతోందా?

  • Share this:
    కేంద్ర బడ్జెట్ వచ్చేది మరో వారంలోనే. ఇప్పటివరకూ దానిపై ఎన్నో అంచనాలున్నాయి. ఎంతో మంది ఎన్నో వెసులుబాట్ల కోసం ఎదురచూస్తున్నారు. ఐతే ఈసారి బడ్జెట్‌లో ప్రైవేటు రంగ ఉద్యోగులకు వరం ఇవ్వబోతున్నట్లు తెలిసింది. కొత్త పెన్షన్‌ స్కీం (EPS)లో వారి కనీస పెన్షన్‌ను పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పెన్షన్‌ పెంచాలని ఎన్నో ఏళ్లుగా యూనియన్లు డిమాండ్‌ చేస్తున్నాయి. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ డిమాండ్‌ను నెరవేర్చబోతున్నారని తెలిసింది. ప్రస్తుతం నెలకు రూ.1,000 ఉన్న కనీస పెన్షన్‌ను రూ.6,000కు పెంచనున్నట్లు తెలిసింది. ఐతే... కేంద్ర ప్రభుత్వం దగ్గర దాదాపు రూ.3 లక్షల కోట్లు పెన్షన్‌ నిధులు ఉన్నాయి. అసంఘటిత కార్మికులతో పాటు వ్యాపారులకు సైతం ఇస్తున్నంత పెన్షనైనా ప్రైవేటు రంగ ఉద్యోగులకు ఇవ్వట్లేదనే అసంతృప్తి... ఆ రంగ యూనియన్లలో కనిపిస్తోంది. అందువల్ల ఈ అంశంపై కేంద్రం దృష్టి సారించింది. నెలకు మినిమం పెన్షన్ రూ.5,000 అదనంగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే... ఇదివరకటి కమ్యుటేషన్‌ పద్ధతిని మళ్లీ తేవాలని కూడా భావిస్తోంది. ఈ విధానంలో ఉద్యోగులు రిటైర్మెంట్‌ సమయంలో ప్రావిడెంట్‌ ఫండ్‌ (PF)తో పాటు కొంత పెన్షన్‌ మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే 15 ఏళ్ల పాటు నెలవారీ పెన్షన్‌ మూడోవంతు తగ్గుతుంది. 2009లో ఆపేసిన ఈ పద్ధతిని తిరిగి తేవాలని EPFO కోరుతోంది. 6.5 లక్షల మంది ఉద్యోగులకు ఇది ప్రయోజనం కలిగించనుంది. కొత్తగా ESI ఆస్పత్రులు, డిస్పెన్సరీల ఏర్పాటు ప్రకటనా వెలువడే అవకాశం ఉంది. అందువల్ల కేంద్రం ఎలాంటి బడ్జెట్ తేబోతోంది? నిర్మలా సీతారామన్ ఎలాంటి వరాలు ప్రకటిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి ఉంది.
    Published by:Krishna Kumar N
    First published: