దేశంలోని ప్రతి ఇంటికి నల్లా నీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2020 డిసెంబర్ 23న జల్ జీవన్ మిషన్ ప్రారంభించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 2.90 లక్షల గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ల సంఖ్య భారీగా పెరిగింది. అయితే, ఈ కార్యక్రమాలన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో 10 నగరాల్లో సర్వే నిర్వహించనుంది. ఈ సర్వే ద్వారా ఆయా నగరాల్లో తాగునీటి సమాచారాన్ని సేకరించనున్నట్లు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
సర్వేలో భాగంగా నగరాల్లోని మురుగునీటి నిర్వహణ, నీటి వనరుల లభ్యతపై కూడా సమాచారం సేకరించనుంది. నూతన టెక్నాలజీని ఉపయోగించి ఈ మిషన్‌ను పర్యవేక్షిస్తామని, దీనిపై లబ్ధిదారుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటామని మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు.
‘పే జల్ సర్వేక్షన్’ సర్వే ద్వారా నీటి పరిమాణం, నీటి నాణ్యత, సమాన పంపిణీ, వ్యర్థ జలాల పునర్వినియోగం, నీటి వనరుల మ్యాపింగ్‌ను సులభంగా నిర్ధారించవచ్చని మిశ్రా స్పష్టం చేశారు. కాగా, ‘పే జల్ సర్వేక్షన్’ సర్వేను మొదటి దశలో ఆగ్రా, బద్లాపూర్, భువనేశ్వర్, చురు, కొచ్చి, మదురై, పాటియాలా, రోహ్ తక్, సూరత్, తుంకూర్ అనే 10 పట్టణాల్లో నిర్వహించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ పైలెట్ సర్వేలో తేలిన ఫలితాల ఆధారంగా, దీన్ని అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (AMRUT) నగరాలకు విస్తరించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పౌరులు, మున్సిపల్ అధికారులతో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూల ద్వారా డేటా సేకరించనున్నారు. దీనిలో త్రాగునీరు, మురుగునీటి నిర్వహణ, నీటి వినియోగం, ఆయా నగరాల్లోని మూడు ప్రధాన నీటి వనరుల స్థితిగతులపై సమాచారం సేకరిస్తారు. శాంపుల్ కలెక్షన్, ల్యాబరేటరీ టెస్టింగ్, ఫీల్డ్ సర్వే ద్వారా ఈ పైలెట్ సర్వేను నిర్వహించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, జల్ జీవన్ మిషన్ (అర్బన్) ద్వారా మొత్తం 4,378 పట్టణాల్లోని ఇళ్లకు నల్లా నీరు సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Central Government, Save water, Water