Indian Variant: అది మన వైరస్ కాదు..WHO కూడా ఎక్కడా వాడలేదు..తప్పుడు ప్రచారం చేయొద్దన్న కేంద్రం..

ప్రతీకాత్మక చిత్రం

Indian Variant: భారత్ లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దీనికి B.1.617 కరోనా​ వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీన్ని ‘ఇండియన్​ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్నట్లు ఇటీవలి కాలంలో మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. ఇప్పుడు దీనిపై కేంద్రం సీరియస్ అయింది.

  • Share this:
భారత్​లో బయటపడ్డ B.1.617 కరోనా​ వేరియంట్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఈ వైరస్​ నిత్యం వేలాది మందిని బలితీసుకుంటోంది. అయితే, దీన్ని ‘ఇండియన్​ వేరియంట్’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్​ఓ) పేర్కొన్నట్లు ఇటీవలి కాలంలో మీడియాలో అనేక కథనాలు వెలువడ్డాయి. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. B.1.617 అనేది ‘ఇండియన్​ వేరియంట్’ అని చెప్పేందుకు ఎక్కడా ఆధారాలు లేవని, ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురించే ముందు మీడియా జాగ్రత్త వహించాలని కేంద్రం సూచించింది. అసలు, డబ్ల్యూహెచ్ఓ తన నివేదికల్లో ‘ఇండియన్​ వేరియంట్​’ అనే పదం ఎక్కడా వాడలేదని గుర్తుచేసింది. అయినా సరే, చాలా మీడియా సంస్థలు అత్యుత్సాహంతో B.1.617 వేరియంట్​ను ఇండియన్​ వేరియంట్​గా పేర్కొంటూ కథనాలను ప్రచురించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా, WHO విడుదల చేసిన 32 పేజీల డాక్యుమెంట్​లో కూడా ఈ వేరియంట్​ ‘ఇండియా’కు చెందినట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. వైరస్, వాటి వివిధ రూపాలను అవి మొదట కనిపించిన దేశాల పేర్లతో గుర్తించడం లేదని.. వాటిని శాస్త్రీయ నామంతోనే గుర్తిస్తామని డబ్ల్యూహెచ్​ఓ ఇటీవల చెప్పిన విషయాన్ని ఉదహరించింది. దీనితో పాటు, ప్రస్తుతం ఇండియాలో విజృంభిస్తున్న B.1.617 వేరియంట్​ 44 దేశాల్లో కన్పించిందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించినట్లు వచ్చిన వార్తలపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ అంశంపై విడుదల చేసిన నివేదికలో ‘ఇండియన్​’ అనే పదాన్ని డబ్ల్యూహెచ్ఓ ఎక్కడా వాడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

44 దేశాల్లో B.1.617 వేరియంట్​..
కాగా, డబ్ల్యూహెచ్ఓ తాజాగా విడుదల చేసిన నివేదికలో B.1.617 వేరియంట్​ను ప్రపంచానికి ఆందోళనకరమైన వేరియంట్​గా అభివర్ణించింది. దీన్ని అక్టోబర్​లోనే భారత్​లో గుర్తించామని, ఆ తర్వాత ఇది ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తి చెందిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం పేర్కొంది. ప్రస్తుతం 44 దేశాల్లో బయటపడ్డ ఈ వేరియంట్​ను​ తొలుత బ్రిటన్​, బ్రెజిల్​, దక్షిణాఫ్రికాల్లో గుర్తించినట్లు తెలిపింది. ఇది ఒరిజినల్​ వైరస్​ కంటే చాలా వేగంగా వ్యాపిస్తున్నట్లు కనిపిస్తుండటంతో దీన్ని ఆందోళనకరమైన వేరియంట్ల జాబితాలో చేర్చినట్లు స్పష్టం చేసింది.

B.1.617 వేరియంట్​ను డబుల్ మ్యూటెంట్​గా కూడా పిలుస్తున్నట్లు, ఇది యాంటీబాడీస్​ను తీవ్రంగా దెబ్బతీస్తున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ స్పష్టతనిచ్చింది. కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడానికి కూడా ఈ వేరియంటే కారణమని డబ్ల్యూహెచ్​ఓ వెల్లడించింది. కాగా, భారత్​లోని సెకండ్ వేవ్​కు కారణమైన ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతూ చాలా మందిని బలి తీసుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
Published by:Sridhar Reddy
First published: