దేశంలో అత్యున్నత చట్టసభలు మరోసారి కొలువుదీరేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో శీతాకాల సమావేశాల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది. ప్రభుత్వ అంగీకారంతో ఈ తేదీలు ఖరారైతే, ఉభయ సభల సెక్రటేరియట్లు శీతాకాల సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటిస్తాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశల నిర్వహణకు సంబంధించి రాజ్ నాథ్ నేతృత్వంలోని సీసీపీఏ అక్టోబర్ చివరివారంలో సమావేశమైంది. కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వివిధ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని ఈ తేదీలైతే వీలుగా ఉంటుందని కమిటీ ఒక నిర్ధారణకు వచ్చింది. మొత్తం 19 రోజుల పాటు ఏకకాలంలో లోక్సభ, రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ సమావేశాలు జరగనున్నాయి.
శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ఉభయసభలూ దాదాపు 20 సెషన్స్ భేటీ కానుండగా, క్రిస్మస్కు ముందు సమావేశాలు ముగుస్తాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరుగుతున్నవి కావడంతో ఈ శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కరోనా కారణంగా గతేడాది శీతాకాల సమావేశాలు జరగలేదు. కొవిడ్ నిబంధనల మధ్య జరిగిన వర్షాకాల సమావేశాల్లో రైతు ఉద్యమంపై రచ్చ జరగడంతో సభా వ్యవహారాలు సజావుగా సాగకుండానే కాలం హరించుకుపోయింది.
ప్రస్తుతం దేశంలో పెట్రో, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుండటం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం ఏడాది దాటడం, లఖీంపూర్ లో రైతులపై హింసాకాండ, అరుణాచల్ ప్రదేశ్ లో చైనా ఆక్రమణలు తదితర సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వీటిపై సర్కారును నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. విపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం వ్యూహాలను సిద్ధం చేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Farmers Protest, Parliament, Parliament Winter session