మాజీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుకి మంగళవారం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్స్ అత్యాచార కేసులో ఆయన కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని సుప్రీం తేల్చింది. ఇందుకు గాను రూ.1లక్ష జరిమానాగా విధించింది. అంతేకాదు, ఈరోజు కోర్టు బెంచ్ విరామం కోసం లేచేవరకు ఓ మూలకు కూర్చోవాలని అసాధారణ శిక్ష విధించింది. నాగేశ్వరరావుతో పాటు అడిషనల్ లీగల్ అడ్వైజర్ భసురన్‌కు కూడా ఇదే పనిష్‌మెంట్ ఇచ్చింది. వారం రోజుల్లో జరిమానా మొత్తాన్ని డిపాజిట్ చేయాలని నాగేశ్వరరావును ఆదేశించింది.
అప్పట్లో సీబీఐ డైరెక్టర్‌గా తాను తీసుకున్న నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావు బేషరతుగా క్షమాపణలు చెప్పినప్పటికీ.. ధర్మాసనం దాన్ని తిరస్కరించింది. ముజఫర్‌పూర్ కేసును విచారిస్తున్న ఏకే శర్మను అప్పట్లో సీబీఐ నుంచి బదిలీ చేయడంపై విచారం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితోనే తాను ఆ పని చేసి ఉండాల్సిందని అందులో పేర్కొన్నారు.
తాను ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని.. అసలు ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని తెలిపారు. అయితే చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేత్రుత్వంలోని బెంచ్ మాత్రం నాగేశ్వరరావు వివరణపై సంతృప్తి చెందలేదు. దీంతో అతని క్షమాపణను తిరస్కరిస్తూ జరిమానా విధించింది. కోర్టు అనుమతి లేకుండా విచారణ అధికారిని బదిలీ చేయరాదన్న విషయం తెలిసి కూడా నాగేశ్వరరావు ధిక్కరణకు పాల్పడ్డారని పేర్కొంది. కాగా, ఎన్జీవో బ్రజేష్ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న బీహార్ షెల్టర్ హోమ్స్‌లో దాదాపు 40మంది మైనర్ బాలికలు లైంగిక దాడికి గురయ్యారన్న ఆరోపణలున్నాయి. గతేడాది బీహార్‌లో సంచలనం రేపిన ఈ కేసుపై ఇప్పటికీ విచారణ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alok Verma, CBI, Rakesh Asthana, Supreme Court