హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

CBI: సీబీఐ రాష్ట్రాల పర్మిషన్ తీసుకోవాల్సిందే.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

CBI: సీబీఐ రాష్ట్రాల పర్మిషన్ తీసుకోవాల్సిందే.. తేల్చిచెప్పిన సుప్రీంకోర్టు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CBI: రాష్ట్రాల పరిధిలో సిబిఐ దర్యాప్తునకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది.

  సీబీఐ విచారణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాల పరిధిలో సిబిఐ దర్యాప్తునకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. న్యాయమూర్తులు ఎఎం ఖాన్విల్కర్, బిఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు రూలింగ్ ఇచ్చింది. రాష్ట్రాల పరిధిలో ఈ సంస్థ దర్యాప్తు అంశాలు, నిర్ధేశిత నిబంధనలు అన్నీ కూడా రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలకు అనుగుణంగానే ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎటువంటి దర్యాప్తు అయినా ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తరువాతనే చేపట్టాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

  ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ (డిఎస్‌పిఇ) చట్టంలోని 5, 6 సెక్షన్‌లను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి నుంచి రాష్ట్రాల స్థాయికి వచ్చే సరికి సీబీఐ ఇతర దర్యాప్తు సంస్థల అధికార వినియోగానికి కేంద్రం వీలు కల్పించేందుకు సెక్షన్ 5 ద్వారా మార్గం ఏర్పడుతుంది. అయితే సెక్షన్ 6 పరిధిలో ఈ విధంగా కేంద్రం అధికారాలు ఇచ్చినప్పటికీ సంబంధిత రాష్ట్రాల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని డిఎస్‌పిఇ చట్టంలో ఉన్న విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.

  ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో తమ తమ రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ చెబుతూ పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకుంది. తమ రాష్ట్రాల్లో సీబీఐ ఎంట్రీకి ముందస్తుగా అనుమతి తీసుకోవాలిన పంజాబ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నారు. తమ ముందస్తు అనుమతి లేకుండా సిబిఐ కేంద్రం అధికారాల ద్వారా తమ రాష్ట్రాల్లోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇప్పుడు వెలువరించిన రూలింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CBI, Supreme Court

  ఉత్తమ కథలు