వివాహేతర సంబంధాలపై కర్ణాటక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. భార్య లేదా భర్తల మెడికల్ (Medica Reports) రికార్డుల ఆధారంగా వారివారి అక్రమ సంబంధాలను నిరూపించలేమని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో భాగంగా కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) ధర్వాడ్ బెంచ్ ఈ మేరకు వ్యాఖ్యానించింది. కేసుల విచారణలకు మెడికల్ రికార్డులను ఉపయోగించడం వల్ల వైద్యుడు-రోగి మధ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని, అలాగే భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదంలోకి వైద్యుడిని (Doctor) లాగినట్టు అవుతుందని జస్టిస్ ఎన్.ఎస్. సంజయ్ గౌడ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 2021 మార్చి 30న ధార్వాడ్‌లోని ఫ్యామిలీ కోర్టు (Dharwad family court)ఇచ్చిన ఆదేశాలను కొట్టేస్తూ తీర్పునిచ్చారు.
ఇదీ కేసు..
కర్ణాటకకు చెందిన ఓ మహిళకు అనుకోని పరిస్థితుల్లో అబార్షన్ అయింది. అయితే దీనిని ఒప్పుకోని ఆమె భర్త.. తన భార్య అబార్షన్‌కు సంబంధించిన పత్రాలన్నింటినీ సమర్పించాలని డిమాండ్ చేశాడు. అందుకోసం తన భార్యకు వైద్యం చేసిన డాక్టర్‌ను న్యాయస్థానానికి పిలిపించాలని కోరుతూ కోర్టు మెట్లెక్కాడు. అంతటితో ఆగక తన భార్య వ్యభిచారం చేస్తోందంటూ అభ్యంతరకర ఆరోపణలు చేశాడు. అయితే భర్త ఆరోపణలను సదరు మహిళ వ్యతిరేకించింది. ఓ వ్యక్తికి సంబంధించిన మెడికల్ రికార్డ్‌లు అన్నీ వ్యక్తిగతమైనవేనని ఆమె తరఫు లాయర్ వాదించారు. భర్త సహా మరే ఇతర వ్యక్తీ వాటిని కోరే అవకాశం లేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. పైవిధంగా ఉత్తర్వులను జారీ చేసింది.
విస్తృత ప్రయోజనాలు ఉంటే తప్ప.. వైద్యుడు తన వృత్తికి సంబంధించిన అంశాలను బహిర్గతం చేయకూడదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన కేసుల్లో మాత్రమే అధికారాన్ని ఉపయోగించగరని తెలిపారు. అంతవరకూ రోగికి సంబంధించిన ఎటువంటి రికార్డులనూ చూపించమని వైద్యుడిని బలవంతపెట్టలేమని పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తికి సంబంధించిన మెడికల్ రికార్డులు ప్రైవేట్‌గా ఉంటాయి. అవి అందరికీ అందుబాటులో ఉంచడం కుదరదు’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
‘ఓ వ్యక్తికి సంబంధించిన రికార్డులను చూపించమని లేదా తయారు చేయమని లేదా రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయమని ఆదేశించడం అనేది ఒక గోప్యతా హక్కుకు(ప్రాథమిక) భంగం కలిగించినట్లే. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం సంక్రమించిన జీవించే హక్కును ఉల్లఘించడమే’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
ఇక ఇదే కేసులో విడాకుల అంశాన్నీ న్యాయస్థానం ఎత్తి చూపింది. విడాకులు, భరణం వ్యవహారాలకు సంబంధించిన విచారణను ప్రారంభించింది. భర్త ఆరోపణల ఆధారంగా విడాకులపై విచారణ చేపడతామని ప్రకటించింది. అయితే ఆ మహిళ వ్యభిచార జీవితం గడుపుతూ తనపై క్రూరంగా ప్రవర్తించిందన్న భర్త ఆరోపణలను చట్టపరంగా పక్కా ఆధారాలతో రుజువు చేయాల్సి ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.