హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Supreme Court: తీవ్రమైన నేరారోపణలున్న నేతలను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధిస్తారా?

Supreme Court: తీవ్రమైన నేరారోపణలున్న నేతలను ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధిస్తారా?

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Supreme Court: 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన 539 మంది సభ్యుల్లో 233 మంది నేరారోపణలున్నాయి. అంటే మొత్తం ఎంపీల్లో 43 శాతం మందిపై కేసులు నమోదయ్యాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మనదేశంలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎంతో మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. వారిలో కొందరు జైలుకు కూడా వెళ్లివచ్చారు. మరికొందరు జైల్లో ఉంటున్నారు. అలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధ విధించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. దీనిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు (Supreme Court)... కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అశ్విని ఉపాధ్యాయ్ అనే న్యాయవాది ఈపిటిషన్ వేశారు. తీవ్రమైన నేరాభియోగాలున్న వ్యక్తులను (Candidates with serious criminal background ) ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం దీనిపై స్పందించాలని కేంద్ర న్యాయశాఖ, కేంద్ర హోంశాఖలతో పాటు ఎన్నికల సంఘాన్ని కూడా ఆదేశించింది.

  Pankaja Munde: ప్రధాని మోదీపై బీజేపీ నేత పంకజా ముండే సంచలన వ్యాఖ్యలు.

  ఈ సందర్భంగా పిటిషనర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తీవ్రమైన నేరారోపణలు ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని లా కమిషన్ తన 244వ నివేదికలో తెలిపిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నేరారోపణలు విచారణ దశలో ఉన్నా కూడా.. ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా చేయాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించి న్యాయ కమిషన్‌, సుప్రీంకోర్టు గతంలోనే పలు సూచనలు చేసినప్పటికీ... కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధుల నేరాలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రూపొందించిన గణాంకాలను పిటిషన్‌లో పొందుపరించారు.

  2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన 539 మంది సభ్యుల్లో 233 మంది నేరారోపణలున్నాయి. అంటే మొత్తం ఎంపీల్లో 43 శాతం మందిపై కేసులు నమోదయ్యాయి. ఇలాంటి నాయకుల సంఖ్య 2009 నుంచి 109శాతం పెరిగింది. అంటే రెట్టింపయింది. ఒక ఎంపీ తనపై ఏకంగా 204 క్రిమినల్‌ కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారని అశ్విని ఉపాధ్యాయ్ వెల్లడించారు. ఆయనపై హత్య, దోపిడీ, ఇంట్లోకి చొరబాటు, వేధింపులు వంటి తీవ్ర నేరపూరిత కేసులు వాటిలో ఉన్నాయని చెప్పారు. నేర నేపథ్యం ఎక్కువగా ఉన్నవారికే..ఎన్నికల్లో విజయావకాశాలు అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలపై పార్టీలు ఆధారపడడం పెరిగిపోతోందని...వారికే టికెట్లు ఇచ్చేందుకు పోటీపడుతున్నాయని ఆరోపించారు.

  ఒకప్పుడు పార్టీలు, నాయకులకు నేరస్థులు వివిధ రూపాల్లో సహకరించేవారని, ఆ తర్వాత దానికి ప్రతిఫలంగా తమకు అనుకూలమైన పనులు చేయించుకొని లబ్ధిపొందేవారని ఆయన అన్నారు.కానీ ఇప్పుడు వారు ఏకంగా రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఎన్నికల్లో పోటీచేసి.. అధికారిక పదవులను, హోదాలను పొందుతున్నారని  ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారి వల్ల ప్రజలు స్వేచ్చగా, నిజాయతీగా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. అందువల్ల నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలు.. ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించాలని సుప్రీంకోర్టును కోరారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Election Commission of India, Supreme Court

  ఉత్తమ కథలు