Farmers Protest: విషయం కోర్టులో ఉన్నప్పుడు నిరసనలను అనుమతించవచ్చా? తేల్చనున్న సుప్రీం కోర్టు

రైతుల ఆందోళన (ప్రతీకాత్మక చిత్రం)

రైతుల నిరసనలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం న్యాయపరిశీలనలో ఉన్న చట్టాన్ని ఓ వ్యక్తి సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయిస్తే.. నిరసనలకు అనుమతించాలా? అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది.

  • Share this:
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాల (New Agriculture Act) అమలుపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వ్యవసాయ చట్టాల అమలుపై స్టే కొనసాగుతోంది. కానీ రైతులు మాత్రం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు (Farmers Protests) చేయడానికే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో రైతుల నిరసనలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుతం న్యాయపరిశీలనలో ఉన్న చట్టాన్ని ఓ వ్యక్తి సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయిస్తే.. నిరసనలకు అనుమతించాలా? అని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. వ్యవసాయ చట్టాలపై స్టే విధించినప్పుడు మీరు దేనికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తారు? అసలు నిరసనలు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? అని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది.

కిసాన్ మహాపంచాయత్ అనే రైతు సంఘం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి కోరుతూ రిట్ పిటిషన్‌ దాఖలు చేసింది. తాజాగా ఈ పిటిషన్‌ను ఎ.ఎమ్ ఖాన్విల్కర్, సీటీ రవికుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. విచారణ సందర్భంగా ధర్మాసనం ఇలా ప్రశ్నించింది.

మీరు ఒక సమస్యను త్వరగా పరిష్కరించాలని కోర్టును అడగవచ్చు. కానీ నిరసనకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఎలా అడుగుతారు? నిరసనకు అనుమతి కోరుతున్నారు కదా.. అసలు దేనికి వ్యతిరేకంగా నిరసన చేస్తారు? ఈ చట్టం అమలుపై కోర్టు స్టే ఇచ్చింది. చట్టాలను అమలు చేయమని కేంద్రం కూడా చెప్పింది. ముందుగా మేము చట్టం ప్రామాణికత (validity)ను నిర్ణయించాలని భావిస్తున్నాం. మీరెందుకు చట్ట ప్రామాణికతకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నారు?
జస్టిస్ ఎ.ఎమ్ ఖాన్విల్కర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి


అయితే పిటిషనర్ కిసాన్ మహాపంచాయత్ తరఫున న్యాయవాది అజయ్ చౌదరి వాదించారు. ఈ నిరసన వ్యవసాయ చట్టాల అమలుకు మాత్రమే పరిమితం కాదని ఆయన కోర్టులో తెలిపారు. కనీస మద్దతు ధరను చట్టబద్ధమైన హక్కుగా అమలు చేయాలని కోరుతూ ఒక సానుకూలమైన ధోరణిలో రైతులు నిరసనలు చేయదలుచుకున్నారని అజయ్ చౌదరి వెల్లడించారు.

దాంతో ధర్మాసనం సమాధానమిస్తూ.. నిరసన ఉద్దేశం ఏమిటో పిటిషనర్ నుంచి తెలుసుకోవాల్సిందిగా అజయ్ చౌదరికి సూచించింది. పిటిషనర్ ఎవరికి వ్యతిరేకంగా నిరసన చేయాలనుకుంటున్నారో తెలియజేయాల్సిందిగా ధర్మాసనం అడిగింది. సేకరణ అధికారం(procurement authority) రాష్ట్రాలుగా ఉన్నప్పుడు జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేయడం దేనికి? అని న్యాయమూర్తి ఖాన్విల్కర్ ప్రశ్నించారు. పిటిషనర్ ను ఉద్దేశిస్తూ.. ‘కోర్టులో చట్టాన్ని సవాలు చెయ్యండి లేదా రోడ్డుపై నిరసన తెలపండి. కానీ ఏదో ఒకటి చెయ్యండి’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పిటిషనర్ వాదనను అంగీకరించని ధర్మాసనం
పిటిషనర్ తరఫున అజయ్ చౌదరి ధర్మానికి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. నిరసన తెలిపే హక్కును కోరడం, కోర్టులో చట్టాన్ని సవాల్ చేయడం అనేవి రెండు వేర్వేరు విషయాలు కాదని ఆయన వాదించారు. రక్షణ, సంభాషణ, చర్చలు, న్యాయస్థానాల ముందు సవాలు చేయడం అవసరమేనని అజయ్ చౌదరి వ్యాఖ్యానించారు.

ధర్మాసనం బదులిస్తూ.. కేంద్రం సమయానికి రెస్పాన్స్ దాఖలు చేయకపోతే.. రాజస్థాన్ హైకోర్టు, జైపూర్ బెంచ్ ముందు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు బదిలీ చేయడానికి బెంచ్ ఆదేశాలు జారీ చేస్తుందని స్పష్టం చేసింది. భారత అటార్నీ జనరల్, కె.కె వేణుగోపాల్ ధర్మాసనం సూచనతో ఏకీభవించారు. నిరసనలు నిరంతరాయంగా కొనసాగించడానికి అనుమతి ఇవ్వలేమన్నారు. లఖీంపూర్ ఖేరీలో తాజాగా జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ.. ఇలాంటి నిరసనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయన్నారు.

బాధ్యత వహించేది ఎవరు?

ఈ మాటలతో ఏకీభవిస్తూ "సరిగ్గా చెప్పారు! అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరూ బాధ్యత వహించరు! పైగా ఆస్తి నష్టం జరుగుతుంది." అని జస్టిస్ ఖన్విల్కర్ వ్యాఖ్యానించారు. సీటీ రవికుమార్‌ జోక్యం చేసుకుంటూ ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పుకొచ్చారు. కోర్టులో కేసు కొనసాగుతున్నప్పుడు నిరసనకు అనుమతి ఇవ్వబోమని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా కె.కె వేణుగోపాల్ కోరారు.

దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. కిసాన్ మహాపంచాయత్ ఎన్నడూ నిరసనకు వెళ్లలేదని పిటిషనర్ పేర్కొన్నట్లు ధర్మాసనం గమనించింది. కిసాన్ మహాపంచాయత్ నిరసనకు అనుమతి ఇవ్వాలని కోరుతోంది కాబట్టి ఈ అంశంపై కోర్టు వివరణాత్మక పరిశీలన అవసరమని ధర్మాసనం అభిప్రాయపడింది.


"వాదోపవాదాలు విన్న తర్వాత, నిరసన తెలిపే హక్కు ఒక సంపూర్ణ హక్కు (absolute Right) కాదా అనేదానిపై పరిశీలించడాన్ని సరైనదిగా భావిస్తున్నాం. అందుకే రిట్ పిటిషనర్ ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేయడం ద్వారా చట్టపరమైన పరిహారాన్ని అభ్యర్ధించారు. కానీ కేసు న్యాయ పరిశీలనలో ఉన్నప్పుడు ఈ పిటిషన్ అనుమతించాలా? అంశాన్ని పరిశీలించాలి" అని ధర్మాసనం చివరిగా వ్యాఖ్యానించింది. అలాగే కిసాన్ మహాపంచాయత్ రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని.. ప్రస్తుత రిట్ పిటిషన్‌తో పాటు విచారించాలని ఆదేశాలు జారీ చేసింది.
Published by:Ashok Kumar Bonepalli
First published: