చూస్తుండగానే మూడో దశ కూడా ముగిసిపోబోతోంది. నేటి సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోతాయి. పార్టీల జెండాలు అటకెక్కుతాయి. చివరి రోజు భారీగా ప్రచారం చేసేందుకు అన్ని ప్రధాన పార్టీలూ కేడర్‌ను సమాయత్తం చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు 23న పోలింగ్ జరగబోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని రోహిల్ ఖండ్ ప్రాంతంలో 10 లోక్ సభ స్థానాలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగియబోతోంది. ఈ పోలింగ్‌లో కేంద్ర మంత్రి సంతోష్ కుమార్... బరేలీ నుంచీ బరిలో దిగుతున్నారు. ఇక సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్.. మెయిన్‌పురి నుంచీ పోటీ చేస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ నుంచీ రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద... ఈసారి బీజేపీ తరపున రాంపూర్ నుంచీ పోటీ చేస్తుంటే... ఆమెకు దీటుగా పోటీచేస్తున్నరు ఎస్పీ నేత మహ్మద్ అజం ఖాన్. ఇక ఫిలిబిత్ నుంచీ బీజేపీ అభ్యర్థిగా వరుణ్ గాంధీ బరిలో ఉండగా... ప్రగతి శీల్ సమాజ్ వాదీ పార్టీ (లోహియా) అధ్యక్షుడు శివపాల్ సింగ్ యాదవ్... ఫిరోజాబాద్ నుంచీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
మూడో దశ ఎన్నికల ప్రచారంలో ములాయం సింగ్‌కి ఓటు వెయ్యాలని ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి ప్రజలను కోరింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం... బుదౌన్‌లో తమ పార్టీ అభ్యర్థి సలేం షేర్వానీ తరపున ప్రచారం చేశారు. ప్రధానంగా రాంపూర్‌లో జయప్రద, అజం ఖాన్ మధ్య తీవ్రమైన పోటీ ఉంది. జయప్రదపై నోరు పారేసుకున్న అజం ఖాన్‌పై దేశవ్యాప్తంగా విమర్శలు రావడమే కాదు... కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై 72 గంటల ఎన్నికల ప్రచార నిషేధం విధించింది.
బుదౌన్, మెయిన్ పురి తప్ప... మిగతా 8 స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీలున్నారు. చాలా నియోజకవర్గాల్లో పోటీ ప్రధానంగా బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి మధ్యే ఉంది. అయితే, కొన్ని చోట్ల కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీయేతర పార్టీల మధ్య చీలిపోయే అవకాశాలుండటంతో అది బీజేపీకి కలిసొచ్చేలా ఉంది. యూపీలో 20,116 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా... 120 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
జమ్మూకాశ్మీర్... అనంతనాగ్ నియోజకవర్గంలోని ఓ జిల్లాలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో వాయిదా వేసిన త్రిపుర ఈస్ట్, తమిళనాడులోనూ వేలూరు నియోజకవర్గానికి మూడో దశలో పోలింగ్ జరగనున్నట్లు తెలిసింది. గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచీ బరిలో దిగిన అమిత్ షా... తన తరపున ప్రచారానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకోవడం ద్వారా గెలుపు అవకాశాల్ని మెరుగుపరచుకున్నారు.
ఒడిశాలో... ఆరు లోక్ సభ స్థానాలు (సంబల్ పూర్, కియోంఝార్, ధెంకనల్, కటక్, పూరీ, భువనేశ్వర్), 42 అసెంబ్లీ స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరగనుండగా... పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 119 మంది కోటీశ్వరులని తేలింది. వారిలో 103 మంది తమకు కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఒడిశాలో మూడో దశలో లోక్ సభ ఎన్నికల్లో 61 మంది అభ్యర్థులు... అసెంబ్లీ ఎన్నికలకు 356 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పూరీ లోక్ సభ స్థానం నుంచీ పోటీ చేస్తున్న బీజేడీ అభ్యర్థి పినాకీ మిశ్రా ఆస్తుల విలువ రూ.117 కోట్లని తేలింది.
మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలుండగా... మూడో దశలో 14 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 245 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 71 మంది కోటీశ్వరులని తెలిసింది. అలాగే 54 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు స్పష్టమైంది.
కర్ణాటకలో రెండో దశలో 14 స్థానాలకు పోలింగ్ జరిగితే... మిగిలిన... పశ్చిమ, ఉత్తర ప్రాంతాల్లోని 14 లోక్ సభ స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరగనుంది. చిక్కోడి, బెల్గాం, బాగల్కోట్, బిజాపూర్, గుల్బర్గా, రాయ్‌చూర్, బీదర్, కొప్పాల్, బళ్లారీ, హవేరీ, ధార్వాడ్, ఉత్తర కన్నడ, దేవనగరి, షిమోగా స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ మొత్తం 14 స్థానాల్లో పోటీ చేస్తుండగా... కాంగ్రెస్ 11, జేడీఎస్ 3 స్థానాల్లో బరిలో దిగాయి. 2014లో ఇక్కడ బీజేపీ 11 స్థానాలు గెలుచుకోగా... కాంగ్రెస్ 3 సాధించింది. జేడీఎస్ ఒక్క స్థానమూ గెలవలేదు.
ఇవి కూడా చదవండి :
అభ్యర్థులు 370 మంది... 58 మందిపై పెండింగ్ కేసులు... గుజరాత్‌లో నేరస్థులకే టికెట్లు ఇస్తున్నారా...
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారా... నిజానిజాలేంటి...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gujarat Lok Sabha Elections 2019, Karnataka Lok Sabha Elections 2019, Lok Sabha Election 2019, Uttar Pradesh Lok Sabha Elections 2019