'చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్'కి కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రతీకాత్మక చిత్రం

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (CDS) ఫోర్ స్టార్ జనరల్‌గా ఉంటారని.. ఆయన వేతనం సర్వీస్ చీఫ్స్ వేతనంతో సమానంగా ఉంటుందని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారని తెలిపారు.

 • Share this:
  రక్షణ శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత సైన్యం, భారత నౌకాదళం, భారత వాయుసేన...ఈ త్రివిధ దళాలు కలిసి సమన్వయంతో పనిచేసేందుకు కొత్తగా మిలటరీ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్‌ను తీసుకొచ్చింది. ఈ డిపార్ట్‌మెంట్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నాయకుడిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవిని సృష్టించేందుకు మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

  కేంద్ర రక్షణశాఖ కింద మిలటరీ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్ పనిచేస్తుందని కేంద్ర సమాచార,ప్రసారమంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ (CDS) ఫోర్ స్టార్ జనరల్‌గా ఉంటారని.. ఆయన వేతనం సర్వీస్ చీఫ్స్ వేతనంతో సమానంగా ఉంటుందని వెల్లడించారు. ఐదేళ్ల పాటు పదవిలో ఉంటారని తెలిపారు.

  సీడీఎస్‌ పదవి ఫ్రేమ్ వర్క్, బాధ్యతలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను కూడా కేబినెట్‌ కమిటీ ఆమోదించింది. త్వరలోనే చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ను నియమించనుంది కేంద్రం. కాగా, త్రివిధ దళాలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేస్తాని ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ఆ తర్వాత సీడీఎస్ బాధ్యతలపై అజిత్ దోవల్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటయింది.

  భారత రక్షణ దళాలన్నింటికీ కలిపి సీడీఎస్‌ పోస్టును ఏర్పాటు చేయాలని 1999లో కార్గిల్‌ కమిటీ చీఫ్‌గా ఉన్న కె.సుబ్రహ్మణ్యం గతంలోనే ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఆ తర్వాత కమిటీ నుంచి వచ్చిన సిఫార్సులపై సమీక్షకు అప్పటి ప్రభుత్వం 2000- ఏప్రిల్‌లో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న సీడీఎస్ ప్రతిపాదనను అమలు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
  Published by:Shiva Kumar Addula
  First published: