news18
Updated: November 10, 2020, 7:51 AM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
November 10, 2020, 7:51 AM IST
బీహార్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా మరో 56 చోట్ల ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఇందులో బీహార్ తో పాటు అందరినీ ఆకర్షిస్తున్న మరో రాష్ట్రం మధ్యప్రదేశ్. బీహార్ అంత లేకపోయినా.. ఇక్కడా ఉప ఎన్నికలు కూడా ఓ మినీ సంగ్రామాన్నే తలపించాయి. ముఖ్యమంత్రి కాకుండా తనకు ‘హ్యాండ్’ ఇచ్చిన హస్తం పార్టీకి కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనతో పాటు తన వర్గం ఎమ్మెల్యేలను కూడా ఆయన వెంట బెట్టుకెళ్లారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికలు ఆయనకు సవాల్ గా మారాయి. మధ్యప్రదేశ్ లో 28 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగగా.. అందులో 22 చోట్ల ఆయనకు చెందిన అనుయాయులే పోటీలో ఉన్నారు. మరి సింధియా తన వారిని గెలిపించుకుంటాడా..?
2018 కి ముందు సుమారు పదిహేనేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ను మధ్యప్రదేశ్ లో మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సింధియా చేసిన కృషి అంతా ఇంతా కాదు. ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించిన ఆయనకు.. చివరికి కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇచ్చింది. సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ను సీఎంగా చేసింది. దీంతో ఏడాది పాటు వేచి చూసిన సింధియా.. ఇక కాంగ్రెస్ లో భవిష్యత్ లేదని గ్రహించి.. ఈ ఏడాది మొదట్లో బీజేపీలో చేరిన విషయం విదితమే. ఆయన తనతో పాటు మరో 22 మంది ఎమ్మెల్యేలను కూడా వెంట తీసుకెళ్లారు. వారందరూ ఇప్పుడు ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. వారిలో ముగ్గురు మంత్రులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత సింధియా మీద పెట్టింది అధిష్టానం.
ఇంగ్లీషులో బీహార్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి Bihar Assembly Election Result 2020
ఉప ఎన్నికల్లో భాగంగా సింధియా కూడా అన్నీ తానే చూసుకున్నారు. తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేల కోసం ఆయన ప్రచారం చేశారు. ఇందులో ఆ రాజవంశానికి (సింధియా కుటుంబం) చెందిన గ్వాలియర్ జిల్లాలోనే 16 స్థానాలు ఉన్నాయి. చంబల్ లోయ పరిధి కిందకు వచ్చే ఈ ప్రాంతంలోనే మొత్తం 22 స్థానాలను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఇక్కడ ఆయనకు గెలుపు నల్లేరు మీద నడకే అని స్పష్టమవుతున్నా.. ఏ మూలో కొంత అనుమానం. ఒకవేళ ఈ స్థానాల్లో ఓడిపోతే సింధియాకు ప్రాధాన్యం తగ్గే అవకాశాలు కూడా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి.
ఇంగ్లీషులో మధ్యప్రదేశ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి MP By Election Result 2020
కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గెలిచి అధిష్టానం దృష్టిని ఆకర్షించాలని ఆయన భావిస్తున్నారు. బీజేపీ లో చేరేటప్పుడే ఆయనకు కేంద్ర మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. కానీ అదెందుకో అప్పుడు కుదరలేదు. కాగా, కోవిడ్ కారణంగా కేంద్ర మంత్రులిద్దరు చనిపోవడం.. బీహార్ లో ఎన్డీయే కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ మరోసారి జరగనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో గెలుపు సింధియా కు ఢిల్లీలో పలుకుబడి పెంచనుంది.
Published by:
Srinivas Munigala
First published:
November 10, 2020, 7:42 AM IST