దేశంలో 5 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్ సభ స్థానానికి ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి లోకల్ సభ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ మృతితో లోక్ సభ స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. అలాగే ఒడిశా, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో 5 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి.
ముఖ్యమైన తేదీలు ఇలా..
ఉపఎన్నికకు సంబంధించి నవంబర్ 10న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నవంబర్ 17 చివరి తేదీ కాగా నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 చివరి తేదీ. డిసెంబర్ 5న ఆయా స్థానాలకు పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 8న కౌటింగ్ చేసి ఫలితాలను ప్రకటించనున్నారు.
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్..
మొత్తం రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు (Gujarat Election Schedule) నిర్వహించనున్నారు. డిసెంబరు 1న తొలిదశ ఎన్నికలు, డిసెంబరు 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 89 నియోజకవర్గాల్లో, రెండో విడతలో 93 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబరు 8న ఓట్లను లెక్కించి.. ఫలితాలను ప్రకటిస్తారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కూడా అదే రోజు విడుదలవుతాయి. తొలి దశ ఎన్నికలకు నవంబరు 5 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. నవంబరు 15న నామినేషన్లను పరిశీలిస్తారు. నవంబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. డిసెంబరు 1న తొలి దశ పోలింగ్ ఉంటుంది. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. 4.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 41వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఎన్నికలకు ఇటీవల నగారా మోగింది. దీనికి సంబంధించి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..అక్టోబర్ 17వ తేదీన ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడనుండగా..నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 25 చివరి తేదీ. అక్టోబర్ 27న నామినేషన్లు పరిశీలించనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 19 చివరి తేదీ. నవంబర్ 12న పోలింగ్ జరగనుండగా..డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా ఈ ఎన్నికలను ఒకే విడతలో జరపనున్నట్లు ఈసీ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.