దేశంలోని ఇళ్లు లేని వారికి గూడు కల్పించడం ప్రభుత్వం బాధ్యత. ఇదే లాజిక్‌ను పట్టుకుని రాముడికి ఓ ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఓ బీజేపీ ఎంపీ. ప్రధానమంత్రి ఆవాసయోజన కింద అయోధ్యలో శ్రీరాముడికి ఓ ఇల్లు కట్టివ్వాలని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ హరి నారాయణ్ రాజ్బర్ డిమాండ్ చేశారు. ‘అయోధ్యలో ఉన్న రామ్ లల్లాకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఓ ఇల్లు కట్టివ్వాలి. ఎందుకంటే ఆయన ఓ టెంట్లో నివసిస్తున్నారు కాబట్టి.’ అని హరినారాయణ్ అన్నారు. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి ప్రాంతంలో 1992లో రాముడి విగ్రహాలను ప్రతిష్టించారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో కొందరు కర సేవకులు ఓ టెంట్ వేసి అందులో రాముడి విగ్రహాలను ప్రతిష్టించారు.
‘రాముడు ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిపోతున్నాడు. ఆయనకు ఓ నీడ కూడా లేదు. దయచేసి రాముడికి ఓ ఇల్లు నిర్మించండి’ అని హరినారాయణ్ కోరుతున్నారు. ఈ విషయాన్ని ఆయన పార్లమెంట్‌కు తెలియజేశారు. ‘ఇళ్లు లేని వారికి గూడు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు రాముడికి నీడ లేదు. కాబట్టి ఇల్లు కట్టివ్వండి’ అని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
డిసెంబర్ 18న జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూడా హరి నారాయణ్ ఈ అంశాన్ని లేవనెత్తారు. అయోధ్యలో రామాలయాన్ని ఎప్పుడు కడతారని ప్రశ్నించారు. అయితే, అందరూ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని, కానీ కొంత సంయమనంతో ఉండాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సర్దిచెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:December 28, 2018, 20:28 IST