మన దేశంలో ఊరికో ఆలయమైనా ఉంటుంది. ఇక పట్టణాలు, నగరాల్లో గల్లీకో గుడి కనిపిస్తుంది. ఐతే కొన్నికొన్ని సార్లు రోడ్డు విస్తరణ పనుల్లో ఆలయాలను తొలగించాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. బీహార్‌లో కూడా ఓ ఆలయం ఉంది. అది రైల్వే ట్రాక్ పక్కనే ఉంది. ఈ రూట్లో కొత్త ట్రాక్ వేసేందుకు ఆలయాన్ని తొలగించాల్సి వచ్చింది. ఎన్నోసార్లు ప్రయత్నించారు. కానీ అలా చేసిన ప్రతిసారీ.. ఏదో ఒక అవాంఛనీయ ఘటన జరిగేది. ఆ గుడికి మహిమాన్వితమైనదని గుర్తించిన అధికారులు.. దానిని అలాగే వదిలేశారు. అక్కడే పునర్నిర్మించారు.
ప్రా జంక్షన్‌కు సమీపంలో శ్రీ బుఢియా మయీ మందిరం ఉంది. అది రైల్వే భూమిలో ఉంది. గోరఖ్‌పూర్, సివాన్, గోపాల్‌గంజ్ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే.. కోరిన కోరికలు నెరవేరుతాయని స్థానికులు చెబుతారు. స్థానిక ప్రజలే కాకుండా రైల్వే పరిపాలన అధికారులు, వారి కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనలు చేయడానికి ఇక్కడకు వస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక రావి, వేప చెట్లు ఉన్నాయి. వీటిపై పెద్ద సంఖ్యలో పక్షులు నివసిస్తాయి. చెట్లపై పదుల సంఖ్యలో గూళ్లు కనిపిస్తాయి. ఇక్కడి ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని స్థానికులు చెబుతున్నారు.
ఐతే కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం వల్ల..బుఢియా మయీ ఆలయాన్ని కూల్చాలని రైల్వే అధికారులు అనుకున్నారు. కొన్ని సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆలయాన్ని కూల్చేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక అవాంఛనీయ ఘటన జరిగేది. ఓసారి ఆలయ ప్రాంగణంలోని రావి చెట్టును నరికేశారు. వెంటనే చెట్టు నుంచి రక్తం రావడంతో.. అందరూ షాకయ్యారు. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. చెట్టు నుంచి రక్తం రావడం చూసి.. రైల్వే ఉద్యోగులు ఆలయ కూల్చివేత పనులను నిలిపివేశారు. ధ్వంసమైన గుడిని.. మళ్లీ పునర్నిర్మించారు. అప్పటి నుంచీ ఆ ఆలయం అక్కడే ఉంది. ట్రాక్ వల్ల గుడికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. ట్రాక్‌ను మళ్లించారు. ఈ ఘటన తర్వాత బుఢియా మయీ ఆలయాన్ని దర్శించుకునే వారి సంఖ్య మరింత పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.