నేటి నుంచీ పార్లమెంట్... ఢిల్లీ అల్లర్లపై దుమారమే...

పార్లమెంట్ (File)

Parliament Session 2020 : ఢిల్లీ అల్లర్లలో 46 మంది చనిపోవడంతో... ఈ అంశమే ఇవాళ్టి పార్లమెంట్ సమావేశాల్లో కీలకం కాబోతోంది. అమిత్‌షా రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చెయ్యబోతున్నాయి.

 • Share this:
  Parliament Session 2020 : ఇవాళ బడ్జెట్ రెండో విడత పార్లమెంట్ సమావేశాలు మొదలై... ఏప్రిల్ 3 వరకూ అవి కొనసాగనున్నాయి. ఐతే... ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ఎన్నిసార్లు వాయిదా పడతాయో ముందే చెప్పలేం. ఎందుకంటే... పరిస్థితులు అలా ఉన్నాయి. ప్రధానంగా ఢిల్లీ అల్లర్లు, హింసపై కేంద్రాన్ని నిలదీస్తామని ప్రతిపక్షాలు ముందే చెప్పాయి. అందువల్ల సమావేశాలు మొదలవ్వగానే... కాంగ్రెస్ సహా విపక్షాలు భగ్గుమనడం... స్వీకర్ సమావేశాల్ని వాయిదా వెయ్యడం వంటి సందర్భాలు కనిపించే అవకాశాలు కొల్లలుగా ఉన్నాయి. ఢిల్లీ అల్లర్లను ఆపడంలో పోలీసులు ఏం చెయ్యలేకపోయారంటూ... కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చెయ్యాలని విపక్షాలు డిమాండ్ చేసే ఛాన్సుంది. ఇదే అంశంపై వాయిదీ తీర్మానం ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉంది. ఆల్రెడీ ఆ పార్టీ నేతలు ఢిల్లీ అల్లర్లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి... హోం మంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేశారు కూడా. అలాగే... ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్‌జేడీ, డీఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా హోంమంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షంగా ఇన్నాళ్లూ... ఏ అంశంపైనా గట్టిగా ప్రశ్నించలేకపోయిన కాంగ్రెస్... ఈసారి మాత్రం అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నట్లు తెలిసింది. బీజేపీ మాత్రం 45 బిల్లులు ఆమోదింపజేసుకోవాలని అనుకుంటోంది.

  సరిగ్గా అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనకు ఫ్యామిలీతోపాటూ వచ్చినప్పుడే... ఈ అల్లర్లు జరగడంతో ఇవి పెద్ద దుమారమే రేపాయి. ఇప్పటివరకూ ఈ అల్లర్లలో 46 మంది చనిపోవడం, మరో 150 మంది ఆస్పత్రుల పాలవ్వడంతో... ఇది మానవ హక్కుల రక్షణకు భంగం కలిగిస్తోందనే వాదన వినిపిస్తోంది. కేంద్రం మాత్రం... ఇందులో కుట్ర దాగి ఉందనీ, ఓ వర్గం కావాలనే ఇదంతా చేసిందని అంటోంది. పోలీసులు కూడా కేంద్రం వాదనే వినిపిస్తున్నారు. భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగడమే కాక... ప్రపంచ దేశాలన్నీ దీనిపై నెగెటివ్‌గా మాట్లాడుకునే పరిస్థితిని తెచ్చింది ఢిల్లీ అల్లర్ల అంశం. కాబట్టి... ఇది ప్రభుత్వానికి సవాలుగా, ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది.

  కాంగ్రెస్ లాగే తృణమూల్, లెఫ్ట్ పార్టీలు కూడా కేంద్రంపై భగ్గుమంటున్నాయి. అసలే అమిత్ షా... ఆదివారం బెంగాల్ వెళ్లి... నెక్ట్స్ బెంగాల్‌లో గెలవబోయేది మేమే అని వ్యాఖ్యలు చెయ్యడంతో... అక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీపై గుర్రుగా ఉన్నాయి. ఇవాళ్టి పార్లమెంట్ సమావేశాల్లో తమ రాజకీయ ప్రతీకారాన్ని తీర్చుకునే అవకాశాలున్నాయి. అవి కూడా అమిత్ షా రాజీనామా కోరుతున్నాయి. సీపీఎం రాజ్యసభలో దీనిపై చర్చ కోరుతూ... 267 రూల్ కింద నోటీస్ ఇచ్చింది. బీజేపీ నేతల విధ్వేషపూరిత ప్రసంగాల వల్లే ఇదంతా జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందువల్ల లోక్‌సభ, రాజ్యసభలో ప్రశాంతంగా చర్చ జరుగుతుందని మనం అనుకోవడానికి వీలు కనిపించట్లేదు. జనవరి 31న మొదలైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు జరిగాయి. మళ్లీ ఇప్పుడు మొదలై ఏప్రిల్ 3 వరకు కొనసాగుతాయి.
  Published by:Krishna Kumar N
  First published: