కరోనా వైరస్ మూడో దశ విలయం, అతిపెద్ద ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మధ్య కీలకమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ప్రసంగించనున్నారు. ఆర్థిక సర్వేను కూడా ఇవాళే సభ ముందుకు తేనున్నారు. పలు రాజకీయ కారణాలతో వివిధ పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నాయి. రేపు(ఫిబ్రవరి 1న) ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సెషన్ లో దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న పెగాసస్ నిఘా కుట్ర ఉదంతం, పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అంశం, విపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడం తదితర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. గత నాలుగైదు సెషన్ల మాదిరిగానే ఈసారి కూడా ఉభయ సభల్లో రచ్చ తప్పకపోవచ్చనే అంచనాలున్నాయి. వివరాలివి..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలిరోజైన నేడు(జనవరి 31) ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 30 నిమిషాల ప్రసంగం అనంతరం లోక్‌సభ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. రాజ్యసభ కార్యక్రమాలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి మొదలవుతాయి. మొదటి రోజే ఉభయసభల్లోనూ 'ఎకనామిక్ సర్వే'ను (2021-2022) సమర్పిస్తారు. రేపు, అంటే ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెడతారు. మంత్రి బడ్జెట్ ప్రసంగానంతరం రాజ్యసభ కార్యక్రమాలు మొదలవుతాయి. రాజ్యసభకు సైతం మంత్రి బడ్జెట్ సమర్పిస్తారు.
ఫిబ్రవరి 2 నుంచి కోవిడ్ ప్రోటోకాల్స్‌కు అనుగుణంగా లోక్‌సభ, రాజ్యసభ కార్యక్రమాలు రెండు షిఫ్టులుగా నడుస్తాయి. రాజ్యసభ కార్యక్రమాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిర్వహించాలని, అనంతరం మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ లోక్‌సభ కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించారు. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఫిబ్రవరి 11 వరకూ బడ్జెట్ తొలి విడత సమావేశాలు జరుగుతాయి. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకూ జరుగుతాయి. ఉభయసభల్లోనూ వేర్వేరుగా ప్రధాని రెండు సార్లు మాట్లాడే అవకాశం ఉంది. ఇదే సమయంలో అనేక అంశాలను లేవనెత్తడం ద్వారా విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పట్టే అవకాశాలు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో అటు ప్రభుత్వంతో పాటు ఇటు ప్రతిపక్షాలు ఉభయసభల్లోనూ తమ వాణి బలంగా వినిపించేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ఇదే అంశాలపై అధికార, విపక్ష సభ్యులు పట్టువిడుపుల్లేని ధోరణి ప్రదర్శించడంతో గత సమావేశాలు సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఉభయ పక్షాలకూ కీలకం కానున్నాయి.
'కనీస మద్దతు ధర' (ఎంఎస్పీ) అంశాన్ని కేంద్రం దృష్టికి తెచ్చేందుకు రైతు సంఘాలు మరోసారి సిద్ధమవుతున్నాయి. ఎంఎస్పీపై చట్టం కోసం తమ పోరాటం కొనసాగుతుందని బీకేయూ నేత రాకేష్ తికాయత్ ఇప్పటికే ప్రకటించారు. తమ ప్రియతమ రైతులను 700 మందిని కోల్పోయిన విషయాన్ని తాము ఎన్నటికీ మరచిపోమని చెప్పారు. రైతుల డిమాండ్‌పై సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్న విపక్షాలు బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు పట్టుదలగా ఉన్నాయి.
పెగాసస్ స్పైవేర్, ఇజ్రాయెల్-భారత్ ఒప్పందంపై 'న్యూయార్క్ టైమ్స్' ఇటీవల విడుదల చేసిన నివేదికలోని అంశాలను విపక్షాలు బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన అస్త్రంగా మలుచుకునేందుకు నిశ్చితాభిప్రాయంతో ఉన్నాయి. సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని విపక్షాలు చెబుతుండగా, న్యూయార్క్ టైమ్స్‌ను 'సుపారీ మీడియా'గా కేంద్ర మంత్రి జనర్ (రిటైర్డ్) వీకే సింగ్ పోల్చడంతో ఉభయసభలనూ ఈ అంశం కుదిపేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.