మరో రెండు రోజుల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. జనవరి 26ని ఘనంగా జరుపుకునేందుకు యావత్ దేశం సిద్ధమవుతోంది. ఐతే దానికి సరిగ్గా 2 రెండు రోజులు ముందు జమ్మూకాశ్మీర్‌లో తీవ్ర కలకలం రేగింది. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో మరో రహస్య సొరంగమార్గం బయటపడింది. కథువా జిల్లాలో ఈ సొరంగ మార్గాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. సొరంగాన్ని పాకిస్తానే నిర్మించిందని.. దాని గుండా ఉగ్రవాదులను భారత్‌లోకి చేరవేసేందుకు కుట్ర చేశారని వెల్లడించారు. గత 10 రోజుల్లో బయటపడిన రెండో సొరంగ మార్గం ఇది. వరుసగా సొరంగ మార్గాలు బయటపడుతుండడంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు వెంబడి నిఘాను మరింతా పెంచాయి.
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ దళాలు యాంటీ టన్నెలింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో శనివారం కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో ఉన్న పన్సార్ ప్రాంతంలో టన్నెల్ బయటపడింది. షాకర్గఢ్ (పాకిస్తాన్)లోని అభియాల్-డోగ్రా, కింగ్రీ డికోటె ప్రాంతాలకు ఎదురుగా సొరంగాన్ని గుర్తించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఇది 150 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పు, 30 ఫీట్ల లోతులో ఉన్నట్లు వెల్లడించారు.
#BREAKING: BSF detects yet another tunnel in the Pansar area of Jammu between BP 14 and 15, ahead of Republic Day. Tunnel is 150 mtrs long and 30 feet deep. Near Pakistan BOPs of Abhiyal Dogra and Kingre-De-Kothe of District Shakargarh. Fourth tunnel detected in six months. pic.twitter.com/0V1ppVLcBb
— Aditya Raj Kaul (@AdityaRajKaul) January 23, 2021
10 రోజుల క్రితం ఇదే హీరానగర్ సెక్టార్లో ఓ సొరంగం బయటపడింది. జనవరి 13న బోబియాన్ గ్రామం సమీపంలో 150 మీటర్ల సొరంగాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. కథువా జిల్లాలో గత 6 నెలల్లో మొత్తం 4 సొరంగాలు బయటపడ్డాయి. 2020 జూన్‌లో ఇదే ప్రాంతంలో పాకిస్తానీ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ కూల్చివేసింది. అందులో పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు లభించాయి. తాజాగా రిపబ్లిక్ డేకి ముందు మరో సొరంగం బయటపడడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇంటెలిజన్స్ వర్గాలు ఇచ్చిన సమాచారంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి యాంటీ టన్నెలింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా సొరంగం బయటపడిందని అధికారులు తెలిపారు. హీరానగర్ సెక్టార్లో పాకిస్తాన్ వైపు కదలికలు ఎక్కువగా ఉన్నాయని అనుమానిస్తున్న అధికారులు.. ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Terrorists