వివిధ రెస్టారెంట్లు, ఫుడ్ సప్లై కంపెనీలు తమ ఆహార ఉత్పత్తుల గురించి టీవీలు (TV), సినిమాలు(Cinemas) ఇతర మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తుంటాయి. ఇటీవల కొత్తరకం నాన్‌వెజ్ ఫుడ్స్(Nonveg Foods) గురించి మీడియాలో ఎడ్వర్టైజ్‌మెంట్లు పెరిగాయి. ఇలాంటి యాడ్స్‌తో చాలామంది నాన్‌వెజ్ ఫుడ్ లవర్స్ కొత్త ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుంటారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఇలాంటి అడ్వర్టైజ్‌మెంట్స్ వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఈ ప్రకటనలపై నిషేధం విధించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా తీర్పు వెల్లడించింది బాంబే హైకోర్టు (Bombay Highcourt). మూడు జైన మత ఛారిటబుల్ ట్రస్టులు, ముంబై నివాసి ఒకరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ -PIL) కోర్టు రిజెక్ట్ చేసింది.
ఈ పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ దిపాంకర్ దత్త, జస్టిస్ మహదేవ్ జమ్దార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. మాంసాహార ప్రకటనల వల్ల శాంతియుతంగా జీవిస్తున్న శాకాహారుల హక్కుల ఉల్లంఘన జరుగుతుందని, పిల్లల మనసులు పాడవుతున్నాయని పిటిషనర్లు వాదించారు.
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర మాధ్యమాల్లో మాంసం, మాంసం ఉత్పత్తుల ప్రకటనలు నిషేధించాలని జైన మత ఛారిటబుల్ సంస్థలు షేత్ మోతీషా రిలిజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్, వర్ధమాన్ కుటుంబం, ఆత్మ కమల్ లబ్ధి సురేశ్వరీ జైన్ జ్ఞాన మందిర్, ఇండస్ట్రియలిస్ట్ రామ్నిక్ లాల్ షా హైకోర్టు బెంచ్‌ను కోరారు.
* పర్యావరణానికి నష్టం
పిటిషన్‌ను న్యాయస్థానం విచారిస్తుండగా పిటిషనర్లు తమ వాదన వినిపించారు. మీడియాలో మాంసాహార పదార్థాల ప్రకటనలు చేసే ప్రకటనదారులు పక్షులు, జంతువులు, సముద్ర జీవుల పట్ల క్రూరత్వాన్ని వ్యక్తపరుస్తురున్నారని, పర్యావరణానికి వారు నష్టం కలిగిస్తున్నారని వాదించారు.
మీడియాలో నాన్ -వెజ్ ఫుడ్‌కు సంబంధించిన ప్రకటనలను నియంత్రించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు. సమాచారం, ప్రసార మంత్రిత్వశాఖ, రాష్ట్రాలు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆహా, పౌరసఫరాలు, వినియోగదారుల రక్షణ శాఖ, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలకు కోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఈ ప్రకటనల ద్వారా వెజిటేరియన్స్ అయిన పిల్లలు, పెద్దల గోప్యతకు నష్టం కలుగుతున్నదని, వారి ఇష్టానికి విరుద్ధంగా వారు వాటిని చూడాల్సి వస్తుందని, అలా వారిని బలవంతం చేస్తున్నారని పిటిషనర్లు చెప్పారు. వెజిటేరియన్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్నారు.
ఇది కూడా చదవండి : ఇది కదా సక్సెస్ అంటే.. అమెరికాలో పట్టు వదలని విక్రమార్కుడు..!
* పిటిషన్ లీగాలిటీపై ప్రశ్నలు
పిటిషనర్ల వాదన విన్న ధర్మాసనం.. ప్రతివాదులకు ఆర్టికల్ 19 ద్వారా లభించిన హక్కుల గురించి ఏం చెబుతారు? అని పిటిషనర్లను ప్రశ్నించింది. ఇతరుల హక్కులను హరించినట్లు ఎందుకు అనుకుంటున్నారని అడిగింది. ప్రకటన నచ్చకపోతే చూడకుండా ఉంటే సరిపోతుందని అభిప్రాయపడింది. ఈ సంగతి సాధారణ వ్యక్తికి కూడా తెలుసని పేర్కొంది. లీగల్ గ్రౌండ్స్‌లో పిటిషన్‌ను విచారించేందుకు మెరిట్ లేదని స్పష్టం చేసిన న్యాయస్థానం పిల్‌ను తిరస్కరించింది.
* విధాపరమైన నిర్ణయాలు చేసేది ఎవరు?
చట్టం ప్రకారం ప్రకటనలపై నిషేధించే అధికారం తమకు లేదని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలో పిటిషనర్లు తాము మాంసాహార అమ్మకానికి వ్యతిరేకం కాదని చెప్పారు. దాంతో న్యాయస్థానం కల్పించుకుని ఏదైనా విషయమై తాము నిషేధం విధించలేమని, రూల్స్, గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసేది శాసన సభలని స్పష్టం చేసింది. విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం ఉండబోదని వివరించింది బెంచ్. అంతలో పిటిషనర్లు తాము వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో సవరణలు చేసుకుంటామని చెబుతూ ఉపసంహరణ కోరగా, న్యాయస్థానం అందుకు అంగీకరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bombay high court, National News, VIRAL NEWS