డ్రైనేజీలో మృతదేహం.. ఢిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్ అధికారి మృతి

కత్తితో అతడిని పొడిచి చంపి మురికి కాల్వలో పడేశారని చెప్పాడు. అంకిత్‌ను కాపాడేందుకు అతడి మిత్రులు ప్రయత్నించారని, కానీ కొందరు ఆందోళనకారులు తుపాకులు ఎక్కుపెట్టడంతో భయంతో వెళ్లలేకపోయారని వివరించాడు.

news18-telugu
Updated: February 26, 2020, 4:12 PM IST
డ్రైనేజీలో మృతదేహం.. ఢిల్లీ అల్లర్లలో ఇంటెలిజెన్స్ అధికారి మృతి
అంకిత్ శర్మ
  • Share this:
దేశ రాజధాని నివురు గప్పిన నిప్పులా మారింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో రణరంగంగా మారింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 22 మంది చనిపోయారు. సుమారు 150 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఐతే చాంద్‌బాగ్ ప్రాంతంలో జరిగిన అల్లర్లలో ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగానికి చెందిన అధికారి అంకిత్ శర్మ (28) చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం ఆయన మృతదేహం చాంద్‌బాగ్‌లోని ఓ డ్రైనేజీలో లభ్యమయింది. అంకిత్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.

అంకిత్ శర్మ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం అంకిత్ శర్మ డ్యూటీ నుంచి ఇంటికి తిరిగొచ్చాడని.. అల్లర్ల నేపథ్యంలో బయట ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్లాడని అతడి సోదరుడు అంకుర్ తెలిపారు. ఆ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు అకింత్‌ను పట్టుకొని కొట్టారని ఆరోపించాడు. కత్తితో అతడిని పొడిచి చంపి మురికి కాల్వలో పడేశారని చెప్పాడు. అంకిత్‌ను కాపాడేందుకు అతడి మిత్రులు ప్రయత్నించారని, కానీ కొందరు ఆందోళనకారులు తుపాకులు ఎక్కుపెట్టడంతో భయంతో వెళ్లలేకపోయారని వివరించాడు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అంకిత్ శర్మ 2017లో ఇంటెలిజెన్స్ బ్యూరో విధుల్లో చేరాడు. ఆయన తండ్రి దేవేంద్ర శర్మ ఢిల్లీ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ సైతం అల్లర్లలో చనిపోయిన విషయం తెలిసిందే. అంకిత్ శర్మ మృతి నేపథ్యంలో మళ్లీ పరిస్థితులు అదుపుతప్పకుండా కేంద్రం అదనపు బలగాలను మోహరిస్తోంది. ఢిల్లీలో తాజా పరిస్థితిని కేంద్ర హోంమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు