టీఆర్ఎస్ రైతు దీక్షలో కేసీఆర్ తో రాకేశ్ టికాయత్ (పాత ఫొటో)
భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధికార ప్రతినిధిగా ఉన్న రాకేశ్ తికాయత్, ఆయన సోదరుడిపై సొంత యూనియన్ నేతలే తిరుగుబాటు చేశారు. దీంతో బీకేయూ చీలిపోయింది. వివరాలివే..
రాకేశ్ టికాయత్ (Rakesh Tikait) డిచిన రెండేళ్లలో దేశమంతటా మారుమోగిన పేరు. కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాలు ఏడాదికిపైగా నిర్వహించిన మహోద్యమానికి ముఖచిత్రంగా కనిపించారాయన. కేంద్రం సాగు చట్టాలను రద్దు చేసిన తర్వాత కూడా టికాయత్ రైతు సంబంధిత రాజకీయ ఆందోళనల్లో పాలుపంచుకుంటూ, కనీస మద్దతు ధర చట్టం కోసం మళ్లీ ఉద్యమిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయనకు సొంత సంఘమే భారీ షాకిచ్చింది. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) Bharatiya Kisan Union (BKU) అధికార ప్రతినిధిగా ఉన్న రాకేశ్ తికాయత్, ఆయన సోదరుడిపై సొంత యూనియన్ నేతలే తిరుగుబాటు చేశారు. దీంతో బీకేయూ చీలిపోయింది (Split in BKU).
రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ రాజకీయ పార్టీలతో అంటకాగడంపై ఆయన సొంత సంఘమైన బీకేయూలోనే మెజార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టికాయత్ తీరుకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తుందని పేరున్న బీకేయూ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. బీకేయూలో కీలక నేతలుగా ఉన్న తికాయత్ సోదరులు రాకేశ్, నరేశ్ తీరును వ్యతిరేకిస్తూ జాతీయ ఉపాధ్యక్షుడు రాజేశ్ సింగ్ చౌహాన్ వేరు కుంపటి పెడుతున్నట్లు ఆదివారం నాడు ప్రకటించారు.
పాత బీకేయూలో టికాయత్ సోదరులు ఉంటారని, తమది ఇక కొత్త సంస్థ అని, భారతీయ కిసాన్ యూనియన్ (ఎ-అపొలిటికల్) (బీకేయూ-రాజకీయేతర) పేరుతో అది కార్యకలాపాలు సాగిస్తుందని రాజేశ్ సింగ్ చౌహాన్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. ‘బీకేయూ-ఎ’కు రాజేశ్ సింగ్ చౌహాన్ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా రాజేశ్ సింగ్.. రాకేశ్ టికాయత్ సోదరులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రైతు సంఘమైన బీకేయూ ఏ రాజకీయ పార్టీ కోసం పని చేయరాదనేది సిద్ధాంతం అని, అయితే రాకేశ్ టికాయత్ మాత్రం పూర్తిగా రాజకీయ క్షేత్రంలోకి మారిపోయారని, రైతుల సమస్యలపై దృష్టిపెట్టడం లేదని, ఫలితంగానే వేరుగా సంఘం పెడుతున్నట్లు రాజేశ్ సింగ్ ప్రకటించారు. ఎన్నికల సందర్భాల్లో సంఘం రూల్స్ కు విరుద్ధంగా టికాయత్ వ్యవహరించారని రాజేశ్ ఆరోపించారు.
హర్యానా, పంజాబ్ లో బలంగా ఉన్న బీకేయూలో రాకేశ్ కాయత్ సోదరులదే హవా. ఢిల్లీ శివార్లలో ఆందోళనల సమయంలో రాకేశ్ తటికాయత్ బీజేపీయేతర పార్టీలకు దగ్గరవడం విమర్శలకు దారి తీసింది. 2021 మార్చిలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టికాయత్.. మమతా బెనర్జీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడం, ఈ ఏడాది జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లోనూ టికాయత్ సోదరులు సమాజ్ వాదీ పార్టీ -ఆర్ఎల్డీ కూటమికి బహిరంగంగా మద్దతు తెలిపి, ప్రచారంలోనూ పాల్గొనడం బీకేయూలో లుకలుకలకు కారణమైంది. రైతు ప్రయోజనాల కోసం పనిచేసే బీకేయూలో ఇలాంటి రాజకీయ వాసనలు తగవంటూ అందులోని ఓ వర్గం తీవ్రంగా నిరసిస్తూ వస్తోంది. చివరికి ఇది చిలికి చిలికి గాలివానగా మారి వేరు కుంపటికి దారితీసింది.
కేంద్రంపై వరి పోరులో భాగంగా టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో నిర్వహించిన దీక్షకు సైతం రాకేశ్ టికాయత్ హాజరయ్యారు. అంతకు ముందు కూడా కేసీఆర్ తో టికాయత్ పలుమార్లు భేటీ అయ్యారు. రైతు ఉద్యమం జరుగుతున్నంత కాలం కేసీఆర్ విధానాలను విమర్శించిన టికాయత్.. సాగు చట్టాల రద్దు తర్వాత కేసీఆర్ తో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది. మొత్తంగా రాకేశ్ టికాయత్ రాజకీయ పోకడలను నిరసిస్తూ సొంత నేతలే తిరుగుబాటు చేసి, బీకేయూ (ఏ) చీలిక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.