కర్ణాటకలో పూర్తి మెజారిటీతో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బుధవారం రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో మాట్లాడిన అమిత్ షా.. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప (BS Yediyurappa) తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అని వ్యాఖ్యానించారు. అయితే పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అమిత్ షా(Amit Shah) స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికైన ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని తెలిపారు. కర్ణాటకలో(Karnataka) బీజేపీ ఖచ్చితంగా సగం మార్కును దాటి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఎలాంటి ఎన్నికల పొత్తు పెట్టుకునే అవకాశం లేదని అన్నారు. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తమ అవకాశాలను పెంచుకునేందుకు బీజేపీ దృష్టి సారిస్తోంది.
ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఇటీవలి వారాల్లో దాదాపు అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తూ పార్టీ జన సంకల్ప యాత్ర చేపట్టింది. 2018 కర్ణాటక ఎన్నికలలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ అధికారం దక్కించుకోవడానికి కావాల్సిన మెజారిటీ మాత్రం రాలేదు. ఆ తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. కుమారస్వామి సీఎం అయ్యారు. 2019 జూలైలో 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసింది. మే 10న కర్ణాటక శాసనసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు చెప్పారు. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మొత్తం 25,282 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.
Rising India Summit: చట్టం అందరికీ సమానమే.. ఓబీసీలకు ఇంకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పలేదు: జైశంకర్
‘శివసేన మాతోనే ఉంది..ఉద్దవ్ సొంత పార్టీని విడిచిపెట్టాడు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో పీయూష్ గోయల్
ఎన్నికల నేపథ్యంలో డబ్బులు, మద్యం పంచకుండా చూసేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తం 2,400 సర్వైలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 171 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. మరోవైపు దేశంలోనే తొలిసారి ఓట్ ఫ్రమ్ హోం వెసులుబాటును కల్పించనున్నట్టు సీఈసీ తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకోవచ్చని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.