న్యూఢిల్లీ: దేశంలో అక్టోబర్ 30న జరిగిన మూడు లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 13 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ ఎన్నికలు జరిగాయి. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హుజురాబాద్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ 1,269 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఏపీలోని బద్వేల్‌కు జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ విజయం దాదాపు ఖాయమైంది. ఇక.. వైసీపీ మెజార్టీ ఎంతనే విషయమే తేలాల్సి ఉంది. కర్ణాటకలోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే.. సిందగి స్థానంలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, హానగల్‌లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.
ఇక.. పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అధికార టీఎంసీ హవా కొనసాగుతోంది. నాలుగు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. ఇక.. బీహార్‌లోని దర్భంగా జిల్లాలోని కుషేశ్వర్ ఆస్థాన్ స్థానంలో సీఎం నితీష్ కుమార్ పార్టీకి షాక్ తగిలింది. ఆ స్థానంలో లాలూ యాదవ్ పార్టీ ఆర్జేడీ ముందంజలో ఉండటం గమనార్హం. ఇక.. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ స్థానంలో, రాయ్‌గావ్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. హిమాచల్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. దాద్రానగర్ హవేలీలో శివసేన పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Huzurabad Bypoll Results : మూడవ రౌండ్‌లో కూడా బీజేపీ ఆధిక్యం.. లీడ్ 1269
బీహార్‌లోని మరో అసెంబ్లీ స్థానం తారాపూర్‌లో కూడా ఆర్జేడీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దాద్రానగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ, మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మూడు స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలు చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక.. అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే.. అస్సాంలోని ఐదు స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని నాలుగు స్థానాలకు, మధ్యప్రదేశ్ 3, హిమాచల్‌ప్రదేశ్ 3, మేఘాలయలోని మూడు అసెంబ్లీ స్థానాలకు, కర్ణాటక 2, రాజస్థాన్ 2, బీహార్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలకు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, మిజోరాం రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ 29 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ గత ఎన్నికల్లో అర డజను స్థానాలను బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్ తొమ్మిది స్థానాలను, మిగిలిన స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు గెలుపొందాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Bjp, Congress, Huzurabad By-election 2021, Lok sabha election results, Results, Telangana News, TMC