BJP MP SUSHIL KUMAR MODI SAYS TECH GAINTS GOOGLE FACEBOOK SHOULD PAY FOR NEWS TO LOCAL MEDIA AK
మన వార్తలకు గూగుల్, ఫేస్ బుక్ డబ్బులు ఇవ్వాల్సిందే.. ఆస్ట్రేలియా తరహాలో చట్టం తేవాలన్న బీజేపీ ఎంపీ
సుశీల్ కుమార్ మోదీ (ఫైల్ ఫోటో)
ప్రస్తుతం దేశంలోని మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందిపడుతున్న మీడియా సంస్థలు.. యాడ్ రెవెన్యూను యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలకు కోల్పోవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు.
ఆస్ట్రేలియాను ఆదర్శంగా తీసుకుని గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు స్థానిక మీడియా సంస్థలకు ఏ విధంగా డబ్బులు చెల్లించాలనే దానిపై చట్టం చేయాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుశీల్ కుమార్ రాజ్యసభలో అన్నారు. జీవో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించిన సుశీల్ కుమార్ మోదీ.. ఇప్పటివరకు స్థానిక మీడియా నుంచి వార్తలను తీసుకుని వారికి ఎలాంటి డబ్బులు చెల్లించడం లేదని అన్నారు. గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సంస్థలు కచ్చితంగా న్యూస్ కంటెంట్ వాడుకుంటున్నందుకు స్థానిక మీడియాకు డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా పార్లమెంట్‌ను కేంద్రం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. గత నెలలో ఈ అంశంపై చట్టం చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం స్థానిక మీడియా సంస్థలకు రెవెన్యూ వచ్చేలా చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
ప్రస్తుతం మీడియా సంస్థలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందిపడుతున్న మీడియా సంస్థలు.. యాడ్ రెవెన్యూను యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలకు కోల్పోవడం ద్వారా మరింత ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు. మన సంప్రదాయ స్థానిక మీడియా సంస్థలు వార్తలను సేకరించేందుకు జర్నలిస్టు సహా ఇతర సిబ్బందితో పాటు పరికరాలను సమకూర్చుకోవడానికి ఎంతో ఖర్చు చేస్తున్నాయని సుశీల్ కుమార్ మోదీ అన్నారు.
అయితే సంస్థలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న యాడ్ రెవెన్యూ గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి దిగ్గజ సంస్థలకు దక్కుతోందని అన్నారు. మీడియా సంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. యాడ్ రెవెన్యూ మాత్రం ఈ దిగ్గజ కంపెనీలకు వెళుతోందని అన్నారు. న్యూస్ మీడియా బార్గేనింగ్ కోడ్ ఆధారంగా ఆస్ట్రేలియ తరహాలో ఓ కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. దీని ద్వారా గూగుల్ యాడ్ రెవెన్యూను మీడియా సంస్థలతో పంచుకోవాల్సి ఉంటుందని అన్నారు.
తమ సైట్ నుంచి ఆ వార్తలను తీసేస్తామని గూగుల్ హెచ్చరించిందని.. అయితే చివరకు వెనక్కి తగ్గిందని సుశీల్ మోదీ అన్నారు. ఈ విషయంలో ఆస్ట్రేలియా ముందడుగు వేసిందని.. ఇప్పుడు ఫ్రాన్స్‌తోపాటు ఇతర యూరోపియన్ దేశాలు యాడ్ రెవెన్యూ షేరింగ్‌కు సంబంధించి చట్టాలు చేస్తున్నాయని అన్నారు. సుశీల్ కుమార్ వ్యాఖ్యలపై స్పందించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. ఇది చాలా విలువైన సూచన అని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.