నాకు ఓటు వేయకపోతే శపిస్తా... బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

సాక్షి మహారాజ్(ఫైల్ ఫోటో)

తనకు ఓటు వేయని వారిని శపిస్తానని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఓటర్లను హెచ్చరించారు.

  • Share this:
    ఎన్నికల వేళ బీజేపీ ఎంపీలు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు ఎన్నికల్లో తనకే ఓటు వేయాలని... తనకు ఓటు వేయకుండా ఉద్యోగాలు ఎలా అడుగుతారని ముస్లింలను ఉద్దేశించి కేంద్రమంత్రి బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యల మరువకముందే... మరో బీజేపీ ఎంపీ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావో లోక్‌సభ నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ సాక్షి మహారాజ్... ప్రచారంలో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తనకు ఓటేయకుంటే శపిస్తానని ఆయన కామెంట్ చేయడం కలకలం రేపింది.

    తాను ఒక సన్యాసినని... మీ ఇంటికి వచ్చి ఓట్లు అడుగుతున్నానని ఆయన అన్నారు. ఓట్లను భిక్షగా అడుగుతున్న తనకు ఓటు వేయకపోతే మీ కుటుంబం సుఖసంతోషాలను తీసేసుకుంటానని... మిమ్మల్ని శపిస్తానని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. తాను ఏదో తేలిగ్గా ఈ మాటలు చెప్పడం లేదని తన మాటలను సమర్థించుకున్నారు. పురాణాల్లోని అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయం చెబుతున్నానని అన్నారు. తాను డబ్బు, భూమి అడగటం లేదు అని సాక్షి మహారాజ్ ఓటర్లకు తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి.
    First published: