కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన ప్రముఖ సినీ నటి ఖుష్బూ.. ఆందోళనలు చేపట్టే అంశంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వీసీకే అధినేత తిరుమావళవన్ అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆమె ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఖుష్బూ మండిపడ్డారు. ఇందుకు నిరసనగా ఖుష్బూ నేతృత్వంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. అయితే ఇందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినా ఆందోళన చేపట్టేందుకు ఖుష్బూ సిద్ధమవడంతో... పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
చెన్నై నుండి చిదంబరంకు ప్రయాణిస్తుండగా ముత్తుకాడు సమీపంలో ఆమెను అడ్డుకొని అరెస్టు చేశారు. కుష్బూతోపాటు మరికొంత మంది మహిళానేతలు, ఇతరలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తన చివరి శ్వాస వరకు మహిళల గౌరవాన్ని కాపాడేందుకు పోరాడతానని ఖుష్బూ అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహిళల భద్రతకే ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. తాము కూడా ఆయన మార్గంలోనే వెళతామని అన్నారు. కొంతమంది శక్తుల అకృత్యాలను సహించేది లేదని ఆమె ప్రకటించారు. ఇక ఇటీవల వీసీకే నేత తిరుమావళవన్.. మనుస్మృతి, మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఖుష్బూ ఆరోపించారు. ఈ మేరకు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:October 27, 2020, 14:24 IST