news18-telugu
Updated: July 9, 2020, 7:04 AM IST
బీజేపీ నేత వసీమ్ బారీ
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బండిపోరా జిల్లాలో బీజేపీ నేత ఫ్యామిలీపై కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటనలో స్థానిక బీజేపీ నేత షేక్ వసీమ్ బారీతో పాటు ఆయన తండ్రి, సోదరుడు మరణించారు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ వసీం, ఆయన తండ్రి బషీర్ అహ్మద్, సోదరుడు ఉమర్ బషీర్ సోమవారం రాత్రి తమ దుకాణంలో కూర్చొని ఉన్న సమయంలో బైక్‌పై వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. పోలీస్ స్టేషన్‌కు 10 మీటర్ల దూరంలోనే ఈ ఘటన జరిగింది.
అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. బీజేపీ నేతను చంపి పారిపోయిన ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. ఐతే షేక్ వసీమ్‌కు 10 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. కాల్పుల సమయంలో ఒక్కరు కూడా ఆయనతో లేకపోవడం అనుమానాలను తావిస్తోంది. ఆ క్రమంలోనే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు మొత్తం 10 మంది భద్రతా సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
షేక్ వసీమ్ గతంలో బండిపోరా జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా, ఈ ఘటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఖండించారు. వసీమ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ట్వీట్ చేశారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా. కాంగ్రెస్, పీడీపీ నేతలు సైతం బీజేపీ ఫ్యామిలీ హత్యను ఖండించారు.
Published by:
Shiva Kumar Addula
First published:
July 9, 2020, 6:54 AM IST