BJP LEADER BABUL SUPRIYO REPLACED AS UNION MINISTER RECENTLY SAYS QUITTING POLITICS SK
Babul Supriyo: బీజేపీకి షాక్.. రాజకీయాలకు మాజీ కేంద్రమంత్రి గుడ్‌బై.. ఎంపీ పదవికి రాజీనామా
బాబుల్ సుప్రియో
Babul Supriyo: ఇటీవల చేపట్టిన కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన్ను మంత్రి పదవి నుంచి బీజేపీ పెద్దలు తప్పించారు. బాబుల్ సుప్రియోతో పాటు చాలా మంది నేతలకు ఉద్వాసన పలికారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు ఆయన గుడ్‌బై చెప్పారు. అంతేకాదు ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇకపై సమాజ సేవ మాత్రమే చేస్తానని.. ఏ రాజకీయ పార్టీతోనూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన నివాసాన్ని కూడా నెల రోజుల్లో ఖాళీ చేస్తానని చెప్పారు. ఇటీవల చేపట్టిన కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన్ను మంత్రి పదవి నుంచి బీజేపీ పెద్దలు తప్పించారు. బాబుల్ సుప్రియోతో పాటు చాలా మంది నేతలకు ఉద్వాసన పలికారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
'' అల్విదా. నేను టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. ఎవరి నుంచీ నాకు ఆహ్వానం అందలలేదు. నేను వన్ టీమ్ ప్లేయర్‌ని. ఒకే ఒక్క టీమ్‌ను మాత్రమే సపోర్ట్ చేశాను. పశ్చిమ బెంగాల్లో బీజేపీలో మాత్రమే పనిచేశాను. నా వల్ల కొంతమంది సంతోషపడ్డారు. మరికొందరు బాధపడ్డారు. ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఓ నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా. సమాజసేవ చేయాలంటే రాజకీయాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. నాపై చూపించిన ప్రేమకు గాను అమిత్ షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు. పదవి కోసమే ఇలా చేస్తున్నానని తప్పుగా అర్ధం చేసుకోవద్దు. నన్ను మన్నించండి. అని బాబుల్ సుప్రియో ఫేస్బుక్లో పేర్కొన్నారు.
ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. ఆ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా బాబుల్ సుప్రియో పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. కానీ ఇటీవల చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణలో బాబుల్ సుప్రియోను బీజేపీ పెద్దలు పక్కనబెట్టారు. మంత్రి పదవి నుంచి తొలగించారు.
ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాయింది. ఎన్నికలను బీజేపీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ప్రచారంలో పెద్ద ఎత్తున స్పందన వచ్చినా.. ఫలితాలు మాత్రం ఆశించినట్లుగా రాలేదు. ఆ ఎన్నికల్లో టోలీగంజ్ నియోజకవర్గం నుంచి బాబుల్ సుప్రియో కూడా పోటీచేశారు. అయితే టీఎంసీ అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఆయన ఓడిపోయారు. బాబుల్ సుప్రియో ఓటమితో ఆయనపై బీజేపీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన్ను కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పించారు.. అటు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో విభేదాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల నుంచి తప్పుకుంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు బాబుల్ సుప్రియో.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.