BIRD FLU 4 LAKH POULTRY BIRDS DIE IN HARYANA CENTRE ISSUES ADVISORY TO STATES SK
Bird Flu: మరో ముప్పు.. అక్కడ 4 లక్షల కోళ్లు మృతి.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
ప్రతీకాత్మక చిత్రం
బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావారణమార్పుల శాఖ అడ్వైజరీ జారీచేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే ఆ వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచించింది.
మన దేశంలో బర్డ్ ఫ్లూ (Bird Flu) డేంజర్ బెల్స్ మోగిస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో బయటపడిన ఈ వైరస్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కోళ్లు, కాకులు, బాతులు, నెమళ్లు మృత్యువాతపడుతున్నాయి. హర్యానాలో గత పది రోజుల్లోనే 4 లక్షలకు పైగా పౌల్ట్రీ కోళ్లు చనిపోపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఒక్క పంచకుల జిల్లాలోనే ఇన్ని కోళ్లు మరణించాయి. కొన్ని కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి జలంధర్ రీజినల్ డిసీస్ డయాగ్నసిస్ ల్యాబ్‌కు పంపించారు. ఐతే ఇప్పటి వరకైతే ఏవియన్ ఇన్ఫ్లూయెండా బయటపడలేదు. కానీ ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్‌లో ఏవియన్ ఇన్ఫ్లూయేంజా కేసులు బయటపడ్డాయి. మంగళవారం జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్‌లోనూ కొన్ని కేసులు బయటపడ్డాయి.
బర్డ్ ఫ్లూ కేసులు బయటపడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావారణమార్పుల శాఖ అడ్వైజరీ జారీచేసింది. ఎక్కడైనా పక్షులు చనిపోతే ఆ వివరాలను వెంటనే కేంద్రానికి అందజేయాలని సూచించింది. అంతేకాదు ఈ సీజన్లో మన దేశానికి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో వలస పక్షులు వస్తాయని.. ఈ నేపథ్యంలో వాటిపై గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ఈ వైరస్ మనుషులకు వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టంచేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్యాండ్ డ్యామ్ చట్టుపక్కల పెద్ద మొత్తంలో బాతులు మరణించాయి. వైరస్‌తోనే అవి మృతిచెందినట్లు పరీక్షల్లో తేలింది. అప్రమత్తమైన కంగ్రా జిల్లా యంత్రాంగం.. ఫతేపూర్, దెహ్రా, జవాలి, ఇందోరా ప్రాంతాల్లో చికెన్, గుడ్లు, చేపల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు. ఈ ప్రాంతాల్లో కోళ్ల ఎగుమతి, దిగుమతులను నిలిపివేశారు. పాంగ్ డ్యామ్ చుట్టుపక్కల కఠిన ఆంక్షలు విధించింది. రాకపోకలను నిలిపివేసింది. పాంగ్ డ్యామ్ చుట్టు పక్కల కి.మీ. పరిధిలోని ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.50వేలు జరిమానా విధించనున్నారు.
అటు మధ్యప్రదేశ్‌లోని మాంద్సౌర్ జిల్లాలోనూ పలు చోట్ల చికెన్,గుడ్లు అమ్మకాలపై నిషేధం విధించారు. ఆయా ప్రాంతాలకు కోళ్ల సరఫరాను నిలిపివేశారు. కేరళలోనూ 1700 బాంతులు ఈ వైరస్ కారణంగా మరణిస్తున్నాయి. అలప్పుళ, కొట్టాయంలో ముందుజాగ్రత్తగా వేలాది బాతులను చంపి పూడ్చిపెట్టారు. ఈ నేపథ్యంలో కేరళ నుంచి కోళ్ల సరఫరాను తమిళనాడు నిలిపివేసింది. సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పౌల్ట్రీ వాహనాలను వెనక్కి పంపిస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కాకులు పెద్ద ఎత్తున మరణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా సంక్రమిస్తుందని.. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.