Bihar Women: మద్యపానం ప్రజల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో అందరికీ తెలిసిందే. ప్రజా సంక్షేమం కోసం చాలా రాష్ట్రాలు మద్యపాన నిషేధం తీసుకొచ్చాయి. కొన్ని చోట్ల ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం బీహార్(Bihar)లో మద్యపాన నిషేధం(Liquor Ban) అమల్లో ఉంది. అయినా అక్కడ అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్తీ మద్యం బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం అక్రమ విక్రయాలు, వినియోగానికి వ్యతిరేకంగా మహిళలు పోరాటాలు చేస్తుంటారు. తమ జీవితాలలోకి మద్యం మహమ్మారిని తీసుకురావద్దని గళం వినిపిస్తుంటారు.
ఇప్పుడు నూతన పంథాలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఓ రకంగా ఉపాధి పొందుతూ.. ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. డ్రై స్టేట్‌లో ఏజెన్సీలు వివిధ దాడుల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలతో పెద్ద ఎత్తున ట్రింకెట్లను రూపొందిస్తున్నారు. ట్రింకెట్లు అనేవి చవకైన ఆభరణాలు వంటివి. వివిధ రూపాల్లో తయారు చేసే వీటిని అలంకరణ వస్తువులుగా మహిళలు ధరిస్తారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
150 మంది సభ్యులు
జీవిక స్వయం సహాయక సంఘానికి చెందిన 150 మంది సభ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జీవిక అనేది ప్రపంచ బ్యాంకు సహాయంతో నడుస్తున్న బీహార్ గ్రామీణ జీవనోపాధి ప్రాజెక్ట్‌లో ఒక భాగం. దీన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ అయిన బీహార్ రూరల్ లైవ్లీహుడ్స్ ప్రమోషన్ సొసైటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.
70 వేల బ్యాంగిల్స్ తయారీ
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇప్పటి వరకు రెండు టన్నుల మద్యం సీసాలతో 70 వేల బ్యాంగిల్స్ తయారు చేశారు. నవంబర్ 26న పాట్నా జిల్లాలోని సబల్‌పూర్ గ్రామంలో ఈ యూనిట్‌ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఈ ప్లాంట్‌కు రోజుకు 80,000 బ్యాంగిల్స్‌ను తయారు చేయగల సామర్థ్యం ఉంది. దేశంలోనే గ్లాస్ బ్యాంగిల్స్ హబ్‌గా పేరుగాంచిన ఫిరోజాబాద్‌కు చెందిన సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో రెండు టన్నుల సామర్థ్యం గల గ్యాస్ ఆధారిత కొలిమి ఉంది. ఈ గ్యాస్ కొలిమిని నిర్వహించడంలో శిక్షణ పొందిన 10 మంది మహిళలు అక్కడ పని చేస్తున్నారు.
విలేజ్ మార్కెట్స్, విమానాశ్రయంలో విక్రయం
జీవిక స్వయం సహాయక సంఘం నిర్వహించే విలేజ్ మార్కెట్స్, పాట్నా విమానాశ్రయంలో, హస్తకళల మేళాలలో ఈ గాజులను విక్రయిస్తారు. హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల ద్వారా కూడా వాటిని విక్రయించనున్నారు. దీని గురించి జీవిక సభ్యురాలు సుధా దేవి మాట్లాడుతూ.. ఈ వెంచర్ ద్వారా మంచి లాభాలు ఆర్జించాలని భావిస్తున్నామన్నారు. బీహార్ ఎక్సైజ్ కమీషనర్ ధంజీ మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ అభివృద్ధికి, మహిళలకు ఉపాధి కల్పించడం కోసం డిపార్ట్మెంట్ అన్ని రకాల సహాయాన్ని అందిస్తుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Liquor ban, WOMAN