వివిధ రాష్ట్రాల్లో విపక్షాల ప్రభుత్వాలను కూలగొట్టే బీజేపీకి తాము అధికారంలో ఉన్న బీహార్ లో భారీ షాక్ తగలడం ఖాయంగా మారిందా? (Bihar Political Crisis) ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చేసి సీఎం నితీశ్ కుమార్ తిరిగి మహాకూటమితో జట్టుకట్టనున్నారా? విపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాకూటమి 2.0 సర్కారు ఏర్పాటుకు జేడీయూ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే తాజా పరిణామాలను బట్టి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ దిశగా నేడు (మంగళవారం) పాట్నాలో కీలక సమావేశం జరుగుతున్నది..
బిహార్ సంకీర్ణ ప్రభుత్వంలో నెల రోజులుగా కొనసాగుతోన్న సంక్షోభం ఇప్పుడు తారాస్థాయికి చేరుకుంది. మంగళవారం జేడీయూ నిర్వహించనున్న కీలక సమావేశం ప్రస్తుత పరిస్థితులపై ఓ స్పష్టతనిస్తూ.. నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ లెక్కన.. ఈ నెల 11వ తేదీలోపే కొత్త సర్కారు ఏర్పాటుకానున్నట్లు స్పష్టమవుతోంది.
ఏడాదిన్నర కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూతో పొత్తు ఉన్నా, ఆ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి బీజేపీనే చిరాగ్ పాశ్వాన్ ను రంగంలోకి దించిందనే ఆరోపణలున్నాయి. తక్కువ సీట్లు సాధించిన నితీశ్ కుమార్ ను సీఎం పీఠంపై కూర్చొబెట్టినా, పెత్తనం మాత్రం కమలం నేతలే సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా జేడీయూ జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర తాజా మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ శనివారం పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ-జేడీయూ బంధాలు మరింత పలుచబడ్డాయి.
నితీశ్ ఆదేశాలకు విరుద్దంగా ఆర్సీపీ సింగ్ ను కేంద్ర మంత్రిని చేయడంతో బీజేపీ తీరుపై సీఎం గుర్రుగా ఉన్నారు. ఆర్సీపీ సింగ్ ఇటీవల అమిత్‌షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీశ్.. ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ముందు నుంచీ.. కేంద్ర సర్కారులో రెండు బెర్తులు కావాలని నితీశ్ కోరినా.. బీజేపీ పట్టించుకోవడం లేదు. దాంతో.. లోక్ జనశక్తి మాదిరిగా.. ఆర్సీపీ సింగ్ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని నితీశ్ భావించారు. ఆర్సీపీ సింగ్ కూతురి అవినీతిపై నిలదీశారు. దీంతో.. ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. ఈ పరిణామాలు చివరికి ప్రభుత్వ మార్పునకు దారి తీసింది..
కొంత కాలంగా బీజేపీకి దూరం పాటిస్తోన్న సీఎం నితీశ్.. ఆదివారం ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశానికి, గత నెల 17న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌షా నిర్వహించిన సమావేశానికి, పాత రాష్ట్రపతి వీడ్కోలు, కొత్త రాష్ట్రపతి ప్రమాణం.. ఇలా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు జేడీయూ చీఫ్.
ఉచిత పథకాలతో సంక్షేమం వట్టిమాట! ఇదిగో రుజువులు..పేదలకు సబ్సిడీ కొనసాగాలంటే ఇలా..
పాట్నా వేదికగా మంగళవారం నాడు నితీశ్ తన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. తదనంతరం భవిష్యత్ కార్యాచరణపై ఆయన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. తాజాగా అందుతోన్న సమాచారం మేరకు జేడీయూ నేతల భేటీకి ఆర్జేడీ ప్రతినుధులు కూడా వచ్చారని, పెగాసస్ నిఘా భయంతో నేతలు అందరూ తమ సెల్ పోన్లను బయటే ఉంచేసి సమావేశ మందిరంలోకి వెళ్లారని తెలుస్తోంది. స్పీకర్ ఆరోగ్యం విషయంలోనూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొవిడ్ పాజిటివ్ గా తేలిన అసెంబ్లీ స్పీకర్ కు 24 గంటలు తిరక్కముందే నెగటివ్ రిపోర్టు రావడం గమనార్హం.
బీజేపీకి షాకిచ్చి తిరిగి మహా కూటమి సర్కారు ఏర్పాటు చేయనున్న జేడీయూ నితీశ్ కుమార్.. ఎన్నికలకు విముఖత ప్రదర్శిస్తున్నారు. జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో పాత మిత్రులు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకొని అధికారాన్ని కాపాడుకుంటారనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి బలాన్ని చేకూర్చేలా విపక్ష పార్టీల ప్రకటనలున్నాయి. 75 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఆర్జేడీ మద్దతు నితీశ్‌కు ఉంటుందని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. బీజేపీని కాదనుకుంటే.. మద్దతివ్వడానికి తాము సిద్ధమని వామపక్ష పార్టీలు ప్రకటించాయి.
సీపీఐ(ఎంఎల్)-లెనిని్‌స్టకు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో రెండేసి సీట్లున్నాయి. నితీశ్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేతలు ప్రకటించారు. మరోవైపు నితీశ్‌తో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ.. ఫోన్‌లో మాట్లాడారనే ప్రచారం జోరందుకుంది. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీలో అధికారానికి 122 మంది సభ్యుల బలం అవసరమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Bjp, JDU, Nitish Kumar, RJD