హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Bihar Updates : నితీశ్ అనే నేను.. 8వ సారి సీఎంగా ప్రమాణం.. డిప్యూటీగా తేజస్వీ.. 7పార్టీలకూ పదవులు..

Bihar Updates : నితీశ్ అనే నేను.. 8వ సారి సీఎంగా ప్రమాణం.. డిప్యూటీగా తేజస్వీ.. 7పార్టీలకూ పదవులు..

నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్

నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్

జేడీయూను ఖతం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఎన్డీఏ నుంచి బయటికొచ్చేసిన నితీశ్ కుమార్.. పాత మిత్రులను మళ్లీ కలుపుకొని మహాకూటమి 2.0 సర్కారును ఏర్పాటు చేస్తున్నారు. 8వ సారి సీఎంగా ప్రమాణం చేస్తున్న ఆయనది అరుదైన రికార్డు..

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar | Patna

పొలిటికల్ హైపర్ స్టేట్ అయిన బీహార్ లో మరోమారు కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతోంది. జేడీయూను ఖతం చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ ఎన్డీఏ నుంచి బయటికొచ్చేసిన నితీశ్ కుమార్ (Nitish kumar).. పాత మిత్రులను మళ్లీ కలుపుకొని మహాకూటమి 2.0 సర్కారును ఏర్పాటు చేస్తున్నారు. (Bihar Govt Formation)ఎన్డీఏ ప్రభుత్వ సీఎంగా మంగళవారం రాజీనామా చేసిన నితీశ్.. 24 గంటలు తిరక్కముందే మహా కూటమి సీఎంగా మళ్లీ గద్దెనెక్కుతున్నారు. నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా ప్రమాణం చేయడం గత 22 ఏళ్లలో ఇది 8వ సారి. తద్వారా ఆయన అరుదైన రికార్డును నెలకొల్పారు.

రాజధాని పాట్నా నగరంలో గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ వేదికగా నిరాడంబరంగా నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ ప్రమాణస్వీకారం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే కార్యక్రమంలో వీళ్లిద్దరితో గవర్నర్ ఫగు చౌహాన్ ప్రమాణాలు చేయిస్తారు. మహాకూటమి 2.0లో ఉన్న ఏడు పార్టీలకూ మంత్రి పదవులు దక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 4 బెర్తులు ఖరారైనట్లు తెలుస్తోంది.

Bihar Politics: బీహార్ సీఎంగా నితీష్ రాజీనామా.. 160 ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ మరో లేఖ


మహాకూటమి 2.0 లో 79 స్థానాలున్న ఆర్జేడీతోపాటు.. జేడీయూ(45 + 1 స్వతంత్ర), కాంగ్రెస్‌ (19), సీపీఐఎంఎల్‌(12), సీపీఐ(2), సీపీఎం(2), మాజీ సీఎం మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం(4 స్థానాలు) ఉన్నాయి. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 122 కాగా.. ఈ కూటమి బలం 164గా ఉండనుంది.

8th Pay Commission : ఉద్యోగులకు భారీ షాక్.. 8వ వేతన సంఘంపై కేంద్రం కుండబద్దలు..


తేజస్వీకి ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి బాధ్యతలు అందజేస్తారని తెలుస్తోంది. 2015 ఎన్నికల తర్వాత మహాగఠ్బంధన్‌ ప్రభుత్వంలోనూ తేజస్వీ ఇవే బాధ్యతలను స్వీకరించారు. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పనిచేశారు. వీరి రెండేళ్ల కూటమికి 2017లో బ్రేక్‌ పడింది. అప్పట్లో ఆర్జేడీ అవినీతిని సాకుగా చూపిన నితీశ్‌ కుమార్‌ బీజేపీ పంచన చేరి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీయూ - బీజేపీ కూటమి విజయం సాధించింది. జేడీయూకు తక్కువ మెజారిటీ ఉన్నా.. నితీశ్‌కే సీఎంగా అవకాశం దక్కింది. అయితే.. బీజేపీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని, తన సర్కారును రిమోట్‌ కంట్రోల్‌లా మార్చాలని చూస్తోందని నితీశ్‌ ఇంతకాలం లోలోపల రగిలిపోతూ వచ్చారు. దాంతో.. బీజేపీకి గుడ్‌బై చెప్పి.. మళ్లీ పాతకూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

Freebies : ఉచిత పథకాలతో ప్రమాదం.. అవి భారత ఆర్థిక గమనాన్ని ఎలా దెబ్బతీస్తాయంటే..


కొత్త సర్కారు ఏర్పాటైన తర్వాత అసెంబ్లీ స్పీకర్ ను మార్చనున్నారు. బిహార్‌లో ప్రభుత్వ మార్పు వేళ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌ విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోగ్యంపై ఆందోళనకరమైన వార్తలు వచ్చాయి. సోమవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వగా.. మంగళవారం మరోమారు జరిపిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. ఆయన బీజేపీ ఎమ్మెల్యే కావడంతో తదుపరి నాటకీయ పరిణామాలు తలెత్తకుండా సిన్హాను తప్పించి, ఆర్జేడీ నుంచి కొత్త స్పీకర్ ను ఎన్నుకుంటారని తెలుస్తోంది.

నితీశ్ నాయకత్వంలోని జేడీయూది వెన్నుపోటు రాజకీయాలని బీజేపీ ఆరోపించింది. తాజా పరిణామాలపై బీజేపీ బిహార్‌ అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ తీవ్రంగా స్పందించారు. 2020 ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా.. నితీశ్‌ పార్టీకి అధికారాన్ని కట్టబెడితే.. ఇప్పుడు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడ్డారు. నితీశ్ ప్రమాణస్వీకారం వేళ బీజేపీ తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాట్నా వేదికగా కీలక సమావేశం నిర్వహిస్తున్నది. మంగళవారం నాటి జేడీయూ ఎమ్మెల్యేల భేటీలో నితీశ్.. నాలుగు ఫోన్ రికార్డింగులను వినిపించినట్లు తెలుస్తోంది. జేడీయూ ఎమ్మెల్యేలతో ఓ కేంద్ర మంత్రి బేరసారాలు సాగించిన వైనం తాలూకు టేపులు ఇంకా బహిర్గతం కాలేదు.

First published:

Tags: Bihar, Bihar Goverment, Congress, Nitish Kumar, RJD, Tejaswi Yadav

ఉత్తమ కథలు