బీహార్ (Bihar).. డ్రై స్టేట్..! అంటే అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం (Liquor Ban) అమల్లో ఉంది. మద్యం అమ్మినా.. తాగినా.. తరలించినా.. నేరమే..! ఐనప్పటికీ అక్కడ కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కొందరు అక్రమార్కులు.. కల్తీ మద్యం విక్రయిస్తూ.. ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఈ మద్యాన్ని తాగి జనం పిట్టల్లా రాలుతున్నారు. సారణ్ జిల్లాలోని ఛప్రా ప్రాంతంలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 40 మంది చనిపోయారు. ఈ ఘటనపై విపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమల్లో ఉన్నా.. కల్తీ మద్యం (Spurious Liquor) విక్రయాలు ఎలా జరుగుతున్నాయని విరుచుకుపడుతున్నాయి. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
విపక్షాల విమర్శలపై స్పందించిన బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar)... కల్తీ మద్యం మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం తాగితే... చస్తారని.. అలాంటి వారికి పరిహారం ఇవ్వలేమని స్పష్టం చేశారు.
''కల్తీ మద్యం తాగి గతంలోనూ చాలా మంది మరణించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని అడుగుతున్నారు. మద్యం తాగే వారు ఖచ్చితంగా చనిపోతారు. ఇందుకు మన కళ్లముందున్న ఘటనే సాక్ష్యం. మద్యపాన నిషేధం వల్ల ఎంతో మంది బతుకులు బాగుపడ్డాయి. చాలా మంది మద్యం మానేశారు. కొన్ని కొందరు అక్రమార్కుల వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. పేదల ప్రజలకు బదులు.. కల్తీ మద్యం విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించాను.'' అని ఆయన అన్నారు.
కాగా, బీహార్‌లో 2016 నుంచి మద్యపాదన నిషేధం అమల్లో ఉంది. ఐనప్పటికీ కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఆ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సారణ్ జిల్లాలో జరిగిన ఘటనపై సీఎం నితీష్ కుమార్ క్షమాపణలు చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. బాధితుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నాయి. విపక్షాలపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నితీష్.. ఏంటి మద్యం తాగి సభకు వచ్చారా? అని బుధవారం ఎదురుదాడికి దిగారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Liquor sales, Nitish Kumar