బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికలను బ్యాలెట్ పత్రాల విధానంలో నిర్వహించాలంటూ రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) చేసిన అభ్యర్థనను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను పరిశీలించడం లేదని ఈసీ అధికారులు స్పష్టంచేశారు. బ్యాలెట్ పేపర్ విధానం ముగిసిన అధ్యాయం...ఆ ప్రతిపాదనను పరిశీలించడం లేదని ఓ సీనియర్ అధికారి పేర్కొన్నట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక వెల్లడించింది. ఈవీఎం విధానంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధికారులు తేల్చిచెప్పారని ఆ పత్రిక తెలిపింది.
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో పాటు ఉత్తర బీహార్‌లో భారీ వరదల నేపథ్యంలో ఎన్నికలను వాయిదావేయాలని కోరుతూ ఈసీకి ఆర్జేడీ గత నెల 30న లేఖ రాసింది. షెడ్యూల్ మేరకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తే బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని, ఒక్కో పోలింగ్ కేంద్రానికి ఓటర్ల సంఖ్యను 1000 నుంచి 250 మందికి తగ్గించాలని కోరింది. తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. ప్లాస్టిక్‌పై కరోనా వైరస్ చాలా రోజులు జీవించి ఉండే అవకాశం ఉన్నందున, ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహిస్తే కరోనా వ్యాపించే ప్రమాదముందని పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా బ్యాలర్ పత్రాలు సరైన ప్రత్యామ్నాయంగా అభిప్రాయపడింది.

ఈవీఎంలు
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశంలో నిర్వహించనున్న తొలి ఎన్నికలు. అక్టోబర్ లేదా నవంబరు మాసాల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే పార్టీల ప్రతినిధులతో సమావేశమై చర్చించింది. ఆర్జేడీతో పాటు ఎన్డీయే భాగస్వామ్యపక్షమైన ఎల్జేపీ కూడా కరోనా వైరస్ కారణంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.

ప్రతీకాత్మక చిత్రం
2015 సెప్టెంబర్ 9న ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించగా..ఈ సారి కూడా సెప్టెంబర్ రెండోవారం లేదా మూడో వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బీహార్ అసెంబ్లీ పదవీకాలం నవంబరు 29న ముగియనుండగా..అక్టోబర్ చివర్లో లేదా నవంబరు మొదట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశముందని సమాచారం.