బీహార్ ముఖ్యమంత్రిగా ఇటీవలే నితీశ్ కుమార్ ఏడో సారి ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. వరుసగా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నితీష్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ అత్యధిక కాలం ఆ పదవిలో ఉన్న రెండో సీఎంగా రికార్డు సృష్టించారు. మొత్తం దాదాపు 14 ఏళ్లకు పైగా ఆ పదవిలో ఉన్నారు. నితీశ్ కుమార్ కంటే ముందు 20 ఏళ్లతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉన్నారు. నితీశ్ తర్వాత మూడో స్థానంలో నాగాలాండ్ సీఎం నీపియూ రియో ఉన్నారు.
2000లో తొలిసారి..
2000వ సంవత్సరం మార్చిలో తొలిసారి బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మెజార్టీ నిరూపించుకోలేక వారం రోజుల్లోపే రాజీనామా చేశారు. ఐదేళ్ల తర్వాత జేడీయూ, బీజేపీ కూటమి మెజార్టీ సాధించడంతో రెండో సారి సీఎం అయ్యారు. 2010లో అదే కూటమి ఘనవిజయం సాధించడంతో మూడోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2015 ఫిబ్రవరిలో మళ్లీ సీఎం అయ్యారు. అదే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సారి ఆర్జేడీ, కాంగ్రెస్ తో చేతులు కలిపి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2017లో ఆర్జేడీతో విభేదాల కారణంగా సీఎం పదవికి రాజీనామా చేశారు. 24 గంటల్లోపే బీజేపీతో మరోసారి జతకట్టి ఆరోసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. తాజా ఎన్నికల్లో ఈ కూటమి మరోసారి విజయం సాధించడంతో ఏడోసారి సీఎం పదవి చేపట్టారు నితీశ్ కుమార్.

ప్రస్తుతం పదవిలో ఉంటూ అత్యధిక కాలం సీఎంగా ఉన్న నేతలు
ఇటీవలే నితీశ్ తో పాటు 14 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన తార్ కిషోర్ ప్రసాద్, రేణుదేవి ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ నుంచి ఏడుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, హెచ్ఏఎం, వీఐపీల నుంచి ఒక్కొక్కరు చొప్పున తాజా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.
సిట్టింగ్ సీఎంల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవి చేపట్టినవారి జాబితా..
1. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. 2000 మార్చి నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను నిర్వహిస్తోన్నారు. మొత్తం 20 ఏళ్లకు పైగా ఆ పదవిలో కొనసాగుతున్నారు.
2. రెండో స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. 14 ఏళ్లుగా ఆ పదవిలో ఉన్నారు.
3. నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫియు రియో 13 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారు. 2002 మార్చి నుంచి 2008 జనవరి వరకు ఓ సారి. 2008 మార్చి నుంచి 2014 మే వరకు మరోసారి. 2018 మే నుంచి ఇప్పటి వరకు పదవిలో కొనసాగుతున్నారు.
4. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 13 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. 2005 నవంబరు నుంచి 2018 డిసెంబరు వరకు ఓ సారి. 2020 మార్చి నుంచి ఇప్పటివరకు మరోసారి సీఎం పదవిలో ఉన్నారు.
5. మిజోరాం సీఎం జోరాంథంగా 11 ఏళ్లపాటు ఆ పదవిలో కొనసాగుతున్నారు. 1998 డిసెంబరు నుంచి 2008 డిసెంబరు వరకు ఓ సారి. 2018 డిసెంబరు నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపడుతున్నారు.
6. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ 11 ఏళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నారు. డిసెంబరు 1998 నుంచి 2003 డిసెంబరు వరకు ఓ సారి. 2008 డిసెంబరు నుంచి 2013 డిసెంబరు వరకు మరోసారి. 2018 డిసెంబరు నుంచి ఇప్పటివరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తోన్నారు.
7. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 9 ఏళ్లుగా సీఎం పదవిలో కొనసాగుతున్నారు. 2011 మే నుంచి నిరంతరాయంగా ఇప్పటివరకు ఆమె సీఎంగా బాధ్యతలను నిర్వహిస్తోన్నారు.