బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రంలోని విపక్ష మహాకూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి శనివారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చిందని, దీనిపై శనివారం సాయంత్రం అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యంజయ్ తివారీ మీడియాకు తెలిపారు. బీహార్ మహాకూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్, వికషీల్ ఇన్సాన్ పార్టీ(వీఐపీ), జార్ఖండ్ అధికార పార్టీ జేఎంఎం తదితర పార్టీలు కలిసికట్టుగా అధికార ఎన్డీయే కూటమిని ఢీకొట్టనున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ స్థానాలను నుంచి ఆర్జేడీ పోటీ చేయనుంది.
ఏయే పార్టీకి ఎన్ని సీట్లు..?
మహాకూటమికి రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పెద్దన్న పాత్ర పోషిస్తుండగా...పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 58-60 స్థానాలు కేటాయించే అవకాశమున్నట్లు సమాచారం. సీపీఐ-ఎంఎల్‌కు 13-15 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు తలా 8-10 సీట్లు కేటాయించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సెట్ డిజైనర్ల ముకేష్ సహానీ నేతృత్వంలోని వీఐపీకి 8-10 సీట్లు కేటాయించనుండగా..జేఎంఎంకు 2 స్థానాలు కేటాయించే అవకాశముంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో మిగిలిన స్థానాలకు లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) పోటీ చేయనుంది.
సీట్ల కేటాయింపు వివాదం కారణంగా కీలక పార్టీలు మహాకూటమి నుంచి చేజారకుండా రాంఛీ జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. జైల్లో తనను కలిసిన ప్రత్యేక దూత ద్వారా లూలా సీట్ల సర్దుబాటు చేసినట్లు సమాచారం. ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్..కూటమిపక్షాల నేతల సమక్షంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రకటన చేయనున్నారు.
అయితే తమకు కేటాయించిన స్థానాల పట్ల కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శనివారం జరిగే కూటమిపక్షాల సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేతలు ఎవరూ హాజరుకాబోరని సమాచారం. సీట్లు తక్కువగా ఇవ్వడంతో పాటు తమకు విజయావకాశాలు తక్కువగా ఉన్న స్థానాలను కేటాయించడం పట్ల కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అటు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆర్జేడీ ప్రకటన తర్వాతే తమ వైఖరి ఏంటో చెబుతామని జేఎంఎం స్పష్టంచేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.