news18-telugu
Updated: November 10, 2020, 1:36 PM IST
బీహార్‌లో అతి పెద్ద పార్టీగా బీజేపీ... నెక్ట్స్ సీఎం ఎవరు?
Bihar Assembly Election Result 2020: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా... BJP, JDU సారధ్యంలోని అధికార NDA కూటమి మరోసారి అధికారంలోకి వచ్చే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా... NDA కూటమికి 125 సీట్లలో ఆధిక్యం/గెలుపు ఉంది. అందువల్ల NDA మళ్లీ పవర్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఐతే... అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరించడంతో... ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటివరకైతే... బీజేపీ... ముఖ్యమంత్రి అంశంపై ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. ఎందుకంటే... తమ కూటమి అధికారంలోకి వస్తే... నితీశ్ కుమారే సీఎం అవుతారన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. అందుకు తగ్గట్టే... నితీశ్... తనకు చివరి అవకాశం ఇవ్వమనీ... తనకు ఇవే చివరి ఎన్నికలు అని మూడో దశ ఎన్నికల ప్రచారంలో అన్నారు.
నితీశ్‌కి మరో ఛాన్స్ ఇస్తారా?:ఈ ఎన్నికల్లో బీజేపీ... 20 సీట్లను పెంచుకొని... 73 సీట్లు సాధించేలా కనిపిస్తోంది. అదే సమయంలో... జేడీయూ... 24 సీట్లు కోల్పోయి... 47 స్థానాలకే పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. నితీశ్ పాలన నచ్చకపోవడం వల్లే... ప్రజలు జేడీయూని వ్యతిరేకరించారనీ... అదే సమయంలో... కేంద్రంలోని బీజేపీ పాలన నచ్చడం వల్లే... రాష్ట్రంలో కూడా బీజేపీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ... మళ్లీ నితీశ్‌కుమార్‌కి సీఎం అయ్యే ఛాన్స్ ఇస్తుందని అనుకోలేం. కాకపోతే... వ్యక్తిగతంగా నితీశ్ కుమార్‌కి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అదొక్కటే... ఆయన మళ్లీ సీఎం అయ్యేందుకు అవకాశం కల్పిస్తోంది.
నితీశ్‌కి ఛాన్స్ ఇవ్వకపోతే:
దాదాపు 40 శాతం సీట్లను కోల్పోయిన పార్టీ నుంచి నితీశ్‌కి బీజేపీ మళ్లీ అవకాశం ఇస్తే... ప్రజల్లో అసంతృప్తి ఏర్పడే అవకాశాలు ఉండొచ్చు. ఐతే... తమకు సీఎం ఛాన్స్ ఇవ్వకపోతే... కూటమి నుంచి తొలగుతామని జేడీయూ షరతు పెట్టినా పెట్టొచ్చు. ఐతే... సీట్లు తగ్గాయి కాబట్టి... ఆ పార్టీ అంతలా పట్టుపడుతుందా అన్నది చూడాలి.
నితీశ్‌పై తీవ్ర వ్యతిరేకత:
ప్రస్తుత ఫలితాల్ని చూస్తే... నితీశ్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ఆయన తన 15 ఏళ్ల పాలనా కాలంలో... రోడ్లు, నీరు, విద్యుత్ వంటివి మాత్రమే అందించగలిగారు. ఇంటింటికీ నీరు వచ్చేలా చేస్తానన్న హామీని ఈసారి ప్రజల్లోకి తీసుకెళ్లారు. నీతిమంతమైన పాలనకు ఓటేస్తారా లేక... జంగిల్ రాజ్‌కు ఓటేస్తారా ఆని ప్రజలను కోరారు. ఏది ఏమైనా... ఉద్యోగాలు కల్పించడం, కొత్త పరిశ్రలను రాష్ట్రానికి తెప్పించడంలో... నితీశ్ అనుకున్న స్థాయిలో చేయలేకపోయారు. ఏటా 11 శాతం వృద్ధిరేటు సాధిస్తున్నా... ఇప్పటికీ బీహార్‌లోని 10 కోట్ల మంది జనాభాలో... చాలా మంది పేదలుగానే ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఆయన సీఎం అయినా... సరైన పాలన అందించాల్సిన బాధ్యత బీజేపీపై పడుతుంది.
బీజేపీకి కీలక రాష్ట్రం:
బీహార్‌లో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ... ఇక ఇప్పట్లో ఈ రాష్ట్రాన్ని తిరిగి చేజార్చుకుంటుందని అనుకోలేం. పైకా... పక్కనే ఉన్న బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించాలంటే... బీహార్‌లో సరైన పాలన అందించాల్సి ఉంటుంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకొని... బీజేపీ ఏం చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
బీహార్ ఫలితాలు:
బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి. గెలిచే పార్టీ 122 సీట్లు సాధించాలి. ప్రస్తుతం NDA కూటమి 126 స్థానాల్లో ఆధిక్యం/గెలుపులో ఉంది. RJD, కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి 106 స్థానాల్లో ఆధిక్యం/గెలుపులో ఉంది.
Published by:
Krishna Kumar N
First published:
November 10, 2020, 1:36 PM IST