Farmers Protest: రైతుల ఆందోళనలపై స్పందించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ

‘ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రైతులను గందరగోళానికి గురి చేసేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారు. వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న సంస్కరణలనే మేం చట్ట రూపంలో తీసుకొచ్చాం.’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలపై రైతులు ఆందోళనలను ఉధృతం చేస్తున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిపై మరోసారి స్పందించారు. రైతు సంస్థలు, ప్రతిపక్షాలు కోరితేనే ఈ చట్టాలు తెచ్చామన్నారు. అప్పుడు ఓకే చెప్పిన రైతు సంస్థలు, ప్రతిపక్షాలు ఇప్పుడు మాట మార్చాయని ఆరోపించారు. గుజరాత్‌లోని కచ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల సంక్షేమం కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల ఆందోళనలను, వారి సందేహాలను తాము నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు. ‘ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న సంస్కరణలనే మేం చట్ట రూపంలో తీసుకొచ్చాం. రైతుల క్షేమం కోసం వారి సందేహాలను నివృత్తి చేస్తాం’ అని ప్రధాని మోదీ అన్నారు. రైతుల ఆందోళనల వెనుక పెద్ద కుట్ర ఉందని ప్రధాని మోదీ అనుమానం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రైతులను గందరగోళానికి గురి చేసేందుకు పెద్ద కుట్ర చేస్తున్నారు. వారిని భయాందోళనకు గురి చేస్తున్నారు. వ్యవసాయ సంస్కరణల చట్టాల వల్ల రైతు భూములను ఎవరో లాక్కుంటారనే ప్రచారం చేస్తున్నారు. ఒక్క విషయం చెప్పండి. ఎవరైనా పాల డెయిరీతో ఒప్పందం చేసుకుంటే వారి గేదెలు, ఆవులను డెయిరీ యాజమాన్యం లాక్కుంటుందా?’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

    మరోవైపు మోదీని ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక నింద వేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ‘ప్రధాని మోదీని ఎవరు విమర్శిస్తే వారిపై నిందలు వేస్తారు. విద్యార్థులు విబేధిస్తే వారిని జాతి వ్యతిరేకులు ముద్ర వేస్తారు. ఎవరైనా పౌరులు ప్రశ్నిస్తే వారిని అర్బన్ నక్సల్స్ అంటారు. వలస కార్మికులను పట్టుకుని కరోనా క్యారియర్స్ అంటారు. అత్యాచారం జరిగితే అసలు జరగనే లేదంటారు. ఇప్పుడు ఆందోళనలు చేస్తున్న రైతులను ఖలిస్తాన్ వాదులు అంటున్నారు. మోదీకి వ్యాపారవేత్తలు మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

    కేంద్ర  ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు 18 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ, గుజరాత్ సహా ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న పలు రాష్ట్రాలకు చెందిన రైతులు హస్తిన సరిహద్దుల్లో పెద్ద ఎత్తున చేరుకున్నారు. మూడు చట్టాలను రద్దు చేయడం కుదరదని ఇప్పటికే స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలను పంపింది. అయితే, సవరణలకు తాము తలొగ్గమని, మొత్తం మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని స్పష్టం చేసిన రైతులు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.

    వ్యవసాయ సంస్కరణల చట్టాలపై రైతులు, కేంద్రం చర్చించుకుని ఓ పరిష్కారానికి రావాలని అసోచామ్ సూచించింది. రైతుల ఆందోళనల వల్ల ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడుతోందని తెలిపింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర ప్రభావం పడుతోందని చెప్పింది. రవాణా, ఇతరత్రా మొత్తం నిలిచిపోవడంతో రోజుకు సుమారు రూ.3000 కోట్ల నుంచి రూ.3500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: