ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లాలో వివిధ మావోయిస్టు గ్రూపులకు చెందిన 32 మంది నక్సలైట్లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరంతా స్థానిక గ్రామాలకు చెందిన వారే. లొంగిపోయిన వారంతా పోలీసులపై దాడులు చేయడం, మందుపాత్రలు పేల్చడం వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని అందచేసినట్లు వెల్లడించారు. భద్రతా కారణాలతో వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ‘లొంగిపోయిన మావోయిస్టులందరూ వివిధ గ్రూపులకు చెందిన వారు. మావోయిస్టు సిద్ధాంతాలతో విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం చేపట్టిన 'లోన్ వార్రటు' (మీ ఇంటికి తిరిగి రండి) వంటి పునరావాస కార్యక్రమాలు కూడా వారికి నచ్చాయి. ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని అందించాం.’ అని ఎస్పీ అభిషేక్ పల్లవ తెలిపారు. ఇప్పటికే దంతెవాడ పోలీసులు నక్సల్స్ ప్రభావిత గ్రామాల్లో పోస్టర్లు, బ్యానర్లతో మావోయిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటివరకు 150 మంది జనజీవన స్రవంతిలో కలిసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
మరోవైపు తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో తమ సొంత కొరియర్‌ను మావోయిస్టులు హత్య చేసినట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. ‘ఈరోజు ఉదయం సుమారుగా 7 గంటల సమయంలో చర్ల మండలం చెన్నాపురం, గోరుకొండ గ్రామాల మధ్యలో అటవీ ప్రాంతంలోని రహదారిపై ఒక గుర్తు తెలియని మగ మృతదేహాన్ని గుర్తించాం. అనంతరం మృతదేహాన్ని గురించి విచారణ చేపట్టగా ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్ అనే వ్యక్తిగా గుర్తించారు. మృతుని కుటుంబ సభ్యులు అందించిన సమాచారం మేరకు అతను గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్టు పార్టీ అగ్రనాయకులైన హరిభూషన్, దామోదర్, చంద్రన్న లకు కొరియర్ గా పనిచేసేవాడని తెలిసింది. గత పదిరోజుల నుంచి మావోయిస్టు పార్టీ కోసం పనిచేయాలని హరిభూషన్, దామోదర్ లు ఈశ్వర్ ను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసి, చిత్రహింసలు పెట్టి ఈ రోజు అతనిని గొంతు నులిమి చంపివేశారు. మావోయిస్టులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, సామాన్య ప్రజలలో భయాందోళనలు సృష్టించటానికి అతనిపై పోలీస్ ఇన్ఫార్మర్ అని ముద్ర వేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్ల పోలీస్ స్టేషన్లో Cr.no.165/2020 క్రింద U/s 143, 147 ,148,302 r/w 149,120 (B) IPC , 25(1-B) IA Act , Sec 10,13,20 UAP Act సెక్షన్లతో కేసు నమోదు చేశాం.’ అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ తెలిపారు.