Bhupendra Patel Swearing-in: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్

సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న భూపేంద్ర పటేల్

గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భూపేంద్ర పటేల్ తనకు తెలిసిన వ్యక్తి అని, బీజేపీకి, సమాజానికి ఆయన చేసిన సేవలు అభినందనీయమన్నారు.

  • Share this:
    అహ్మదాబాద్: గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా (Gujarat New CM) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా భూపేంద్ర పటేల్ తనకు తెలిసిన వ్యక్తి అని, బీజేపీకి, సమాజానికి ఆయన చేసిన సేవలు అభినందనీయమన్నారు. ఆయన గుజరాత్‌ను వృద్ధి పథంలో నడిపించి సుసంపన్నం చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆకాంక్షించారు.

    గుజరాత్ గవర్నర్(Gujarat Governor) ఆచార్య దేవ్రాత్ భూపేంద్ర పటేల్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కీలక నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah), బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైన హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరయ్యారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భూపేంద్ర పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

    భూపేంద్ర పటేల్ 1962, జూలై 15న అహ్మదాబాద్‌లో జన్మించారు. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేశారు. 1995లో మెమ్నాగర్ నగరపాలక సంస్థ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో మెమ్నాగర్ నగరపాలక సంస్థ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2008లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(AMC) వైస్ చైర్మన్‌గా సేవలందించారు. 2010లో AMC స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. 2015లో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(AUDA) చైర్మన్‌గా సేవలందించారు. 2017లో తొలిసారిగా ఘట్లోడియా శాసన సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

    ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ సీఎం పదవి దక్కడం విశేషం. గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి శనివారం నాడు విజయ్ రూపానీ (Vijay Rupani) రాజీనామా చేశారు. కారణాలు స్పష్టంగా వెల్లడించనప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసమే తాను పదవి నుంచి తప్పుకుంటున్నానని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త నాయకత్వంలో గుజరాత్ అభివృద్ధి పథంలో సాగుతుందని.. అందుకే తాను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ రూపానీ ప్రకటించారు. అయితే.. మరో 15 నెలల్లో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అయితే.. బీజేపీ అధిష్టానం సూచనతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ మొదలవ్వగానే అనేక ఊహాగానాల నడుమ బీజేపీ అధిష్టానం భూపేంద్ర పటేల్ పేరును ఖరారు చేసింది. ఈ నిర్ణయంపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ అధిష్టానం బుజ్జగింపులతో ఊరడిల్లారు. మీడియాలో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు గుప్పుమనడంతో నితిన్ పటేల్ ఆదివారం ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనను ఎవరూ ప్రజలకు దూరం చేయలేరని.. ప్రజల హృదయాల్లో తనకు స్థానం ఉందని నితిన్ పటేల్ చెప్పారు. ఇదిలా ఉండగా.. నితిన్ పటేల్‌కు సీఎం పదవి అందని ద్రాక్షలా మిగలడం ఇది రెండోసారి. 2016లో కూడా ఆయన సీఎం పదవిని ఆశించి భంగపడ్డారు. తాజాగా.. మరోసారి బీజేపీ అధిష్టానం సమీకరణల నేపథ్యంలో నితిన్ పటేల్‌కు సీఎం పదవి దూరమైంది.

    ఇదిలా ఉండగా.. సీఎంగా ప్రమాణ స్వీకారానికి బయల్దేరే ముందు భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్‌లోని స్వామినారాయణ్ ఆలయంలో గోమాతలను పూజించారు. ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ చేసిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా కొనియాడారు. సీఎంగా తన ఐదేళ్ల పదవి కాలంలో విజయ్ రూపానీ ఎన్నో ప్రజాహితమైన కార్యక్రమాలను అమలు చేశారని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ఆయన అవిశ్రాంతంగా శ్రమించారని ప్రధాని ట్వీట్‌లో పేర్కొన్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: