ప్రస్తుతం అసోం, మిజోరాం మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుకుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా పరిస్థితులు నెలకొన్నాయి. ఏకంగా సీఎంలపైనే కేసులు పెట్టుకునే వరకు వ్యవహారం వెళ్లింది. ఐతే ఈ సందర్భంగా రాజస్థాన్‌లోని ఓ రైల్వేస్టేషన్ గురించి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ రైల్వే స్టేషన్ సరిగ్గా ఇరు రాష్ట్రాల సరిహద్దుపై ఉంటుంది. సగ భాగం రాజస్థాన్‌లో, సగభాగం మధ్యప్రదేశ్‌లో ఉంటుంది. ఏదైనా రైలు వచ్చి స్టేషన్‌లో ఆగితే ఇంజిన్ రాజస్థాన్‌లో ఉంటుంది. కొన్ని బోగీలు మాత్రం మధ్యప్రదేశ్‌లో ఉంటాయి. అంతెందుకు స్టేషన్‌లో టికెట్ల జారీ కౌంటర్ కూడా సరిగ్గా ఇరు రాష్ట్రాల సరిహద్దుపై ఉంటుంది. టికెట్ ఇచ్చే క్లర్క్ రాజస్థాన్ వైపు ఉంటే.. టికెట్ తీసుకునే వ్యక్తి మధ్యప్రదేశ్‌లో ఉంటాడు. ఇది ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేకత. వినడానికే చాలా వింతగా..ఆసక్తిగా ఉంది కదా..!
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా భవానిమండిలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ముంబై, ఢిల్లీని కలిపే ప్రధానమైన రైలు మార్గం ఇది. ఐతే భవానీ మండి రైల్వేస్టేషన్‌ను మధ్యప్రదేశ్ సరిహద్దును ఆనుకొని నిర్మించారు. రైల్టే స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలు సగం రాజస్థాన్‌లో, సగం మధ్యప్రదేశ్‌లో ఉంటాయి. స్టేషన్‌లో నిలబడిన వ్యక్తి ఒక కాలిని రాజస్థాన్‌లో.. మరో కాలుని మధ్యప్రదేశ్‌లో పెట్టవచ్చు. మధ్యప్రదేశ్‌లో మంద్‌సౌన్ జిల్లాలో ఉన్న భైంసోదా పట్టణానికి సమీపంలోనే ఈ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది కూడా రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లను కలుపుతుంది. ఒకే ఇంట్లో కొంత భాగం మధ్యప్రదేశ్‌లో ఉంటే.. మిగతా భాగం రాజస్థాన్‌లో ఉంటుంది. అంటే ఒక డోర్ గుండా మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వెళ్లిపోవచ్చు.
ఐతే ఈ భౌగోళిక ప్రత్యేకతను అడ్డంగా పెట్టుకొని కొందరు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. భవానిమండి చాలా కాలంగా డ్రగ్స్ కార్యకలపాలకు అడ్డంగా మారింది. కొందరు అక్రమార్కులు ఇక్కడి నుంచి రైలు మార్గంలో ఢిల్లీ, ముంబైకి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. ఐతే డ్రగ్ర్స్ పెడ్లర్స్, అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేసేయంలో పోలీసుకు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తున్నాయి. ఇరు రాష్ట్రాల జీఆర్పీ పోలీసుల మధ్య వివాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మధ్యప్రదేశ్ వైపు నేరాలకు పాల్పడి రాజస్థాన్ వైపు, రాజస్థాన్ వైపు నేరాలకు పాల్పడి మధ్యప్రదేశ్ వైపు వెళ్తున్నారు. ఈ కేసు మీ పరిధిలో వస్తుందని వారు.. లేదు మీ పరిధిలోకి వీరు.. ఇలా కేసుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య కన్‌ప్యూజన్ నెలకొంటోంది.
సరిహద్దు మార్గం ద్వారా..ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రజల రాకపోకలు కూడా ఎక్కువగానే ఉంటాయి. భైంసోదాతో పోల్చితే భవాని మండి కాస్త పెద్ద పట్టణం. అందుకే మధ్యప్రదేశ్‌లోని భైంసోదా నుంచి ప్రజలు విద్య, వైద్యం కోసం భవాని మండికి వెళ్తుంటారు. ప్రజలు కలిసి మెలిసి ఉంటారు. ఒకరి సంప్రదాయాలను మరొకరు గౌరవిస్తారు. ఐతే వేర్వేరు చట్టాలు, నిబంధనల కారణంగా.. ఒక్కోసారి బిజినెస్, ఇతర విషయాల్లో ఇబ్బందులు వచ్చేవి. కానీ ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కారణంగా ఇప్పుడైతే ఆ ఇబ్బందులు పెద్దగా కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. అందుకే మధ్యప్రదేశ్, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు భవాని మండి రైల్వే స్టేషన్ చాలా ప్రత్యేకం. దేశంలో మరెక్కడా ఇలాంటి రైల్వే స్టేషన్ లేదు.
ఇది కూడా చదవండి:
'ఆదిత్య 369' లాగే ఇతడు భవిష్యత్‌లోకి వెళ్లాడట..5000లో ప్రపంచం మటాష్.. ఇదిగో ప్రూఫ్
తల్లి గర్భంలోనే గర్భం దాల్చిన శిశువు.. డాక్టర్లు షాక్.. ఎలా సాధ్యం?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madhya pradesh, Railway station, Rajastan